విజయవాడ : నాకే చాలా అసహనంగా ఉంది... ఇక ప్రజల సహనాన్ని చూసి మెచ్చుకోవాల్సిందే అంటూ ఏపీ సీఎం చంద్రబాబు రివర్స్ అయిపోయారు. నిన్నమొన్నటి వరకు నోట్ల రద్దుపై ప్రధాని మోదీని వెనకేసుకొచ్చిన చంద్రబాబు ఇపుడు యు టర్న్ తీసుకున్నారు. బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద ప్రజలు పడుతున్న కష్టాలను గురించి ఇంటెలిజెన్స్ బాబుకు నివేదికలు అందిస్తోంది.
పైగా ప్రజల నుంచి వస్తున్న శాపనార్థాల గురించి కూడా వివరించారు. దీనితో చంద్రబాబు తన స్టాండ్ మార్చుకున్నట్లు తెలుస్తోంది. మొదట్లో అసలు 500, 1000 నోట్లను రద్దు చేయాలని కోరింది తానే అని, క్రెడిట్‌గా చెప్పుకొన్న బాబు... ఇపుడు తన బాణీ మార్చి కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇంత దారుణంగా ఒక సమస్య ఇన్ని రోజులు కొనసాగుతున్న పరిస్థితి తన జీవితంలో ఇది మొదటిసారి అని చంద్రబాబు అసహనాన్ని వ్యక్తం చేశారు.
తను ఒకటి చెపితే, మోదీ మరొకటి చేశారని... 2 వేల నోటు ఎందుకు తెచ్చారని బాబు ఇపుడు రివర్స్ గేర్ వేస్తున్నారు. దీనివల్ల నల్ల ధనం మరింత పెరిగిపోతుందని, 2 వేల నోటు రద్దు చేయాలని డిమాండు మొదలు పెట్టారు. దీనిబట్టి... చంద్రబాబు క్రమేపి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తెలంగాణా సీఎం కేసీఆర్, కేరళ సీఎంల పంథాలోకి వెళుతున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.