స్పెషల్ స్టేటస్ కావాలట... పసుపు చొక్కా వదిలి నల్ల చొక్కా వేసుకున్న బాబు...

శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (10:46 IST)
ఇన్నాళ్లూ ఎన్నికలంటే రాజకీయ నాయకులకు ఓటర్లు మాత్రమే గుర్తొచ్చేవారు... కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయనేతలకు మాత్రం ఇప్పుడు కొత్తగా కేంద్రం తమకు చేసిన మోసాలు, తాము పడ్డ కష్టాలు గుర్తొచ్చేస్తున్నాయ్... బందులు గట్రాలు వదలకుండా చేసేస్తున్నారు. 
 
గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలపాటు ఏ మాత్రం గుర్తుకు రాని ప్రత్యేక హోదా అధికార పక్షానికి ఇప్పుడే గుర్తుకొచ్చేయడం, అఖిలపక్షాలనీ, నిరసనలు చేయాలని తీర్మానాలు చేసేయడం చూస్తూంటే సగటు ఓటరుని ప్రలోభపెట్టేందుకు వీళ్లందరూ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏకమయ్యేదేదో అప్పుడే కేంద్రం ముందు గళం విప్పి ఉంటే ఎంత సాధించేవాళ్లమో కదా అని అందరూ బాహాటంగానే చర్చించుకుంటున్నారు.
 
మరి ఇన్నాళ్లపాటు కేంద్రంతో సయోధ్యలో ఉన్నప్పుడు గుర్తుకు రాని విషయాలన్నీ చంద్రబాబుగారు ఇప్పుడు వెల్లడిస్తూ.. ఆయన్ని సార్ అన్నాను అయినా కనికరించలేదు అని చెప్తూంటే... వినే వాళ్లకే అదేదో దానం అడిగాను అయినా ఇవ్వలేదు అన్నట్లు ఉంది తప్ప అది రాష్ట్రం పొందవలసిన ఒక హక్కుగా మాత్రం అనిపించడం లేదు. 
 
వీళ్ల కూరిమి చెడిన ఇన్నాళ్లకు నిద్ర లేచిన చంద్రబాబు సగటు ఓటరుకి ఇంకా ఏమేమి చెప్పనున్నారో వేచి చూద్దాం. ప్రస్తుతానికి ప్రత్యేక హోదా కోసం ఎప్పుడూ పసుపు చొక్కాలో కనిపించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నల్లచొక్కాలో దర్శనమిచ్చారు. మరి ఈ నిరసనతోనైనా కేంద్రం... మరో నాలుగు నెలల లోపు ప్రత్యేక హోదా ఇస్తుందా... ఎందుకంటే ఎలాగూ మరో నాలుగు నెలల తర్వాత వచ్చేది కొత్త ప్రభుత్వం కాబట్టి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు