విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో సీఎం వైయస్.జగన్. పాల్గొన్నారు. అనంతరం అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించి, అనంతరం పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అమరులైన పోలీసుల కుటుంబసభ్యులకు ఆర్దిక సాయం అందించారు. అనంతరం వైయస్.జగన్ మాట్లాడుతూ, పోలీసు అధికారులకు, ప్రతి ఉద్యోగికి, మీ కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.
ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల దినం దేశం మొత్తం జరుపుకుంటుంది. 1959లో అక్టోబరు 21న చైనా సైనికులను ఎదురించి పోరాడిన ఎస్సై కరణ్ సింగ్ ఆయన సహచరుల ధైర్యాన్ని, త్యాగాన్ని అమరవీరుల సంస్మరణదినోత్సవంగా మన దేశం గత 62 యేళ్లుగా గుర్తు చేసుకుంటుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజల సేవలో ప్రాణాలు వదిలిన ప్రతి పోలీసుకు, ప్రతి పోలీసు కుటుంబానికి మొత్తం సమాజం కూడా జేజేలు పలుకుతోందని సీఎం చెప్పారు.
నేరం ఎప్పటికప్పుడు కొత్త, కొత్త రూపాల్లో దాడి చేస్తోందని, గత రెండున్నరేళ్లుగా ఈ కొత్త కోణం, కొత్త నేరగాళ్లను మన రాష్ట్రంలో చూస్తున్నామన్నారు. వీరు ఎలాంటి పనులు చేశారో కూడా మన కళ్లెదుటనే కనిపిస్తున్నాయి. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. అధికారం దక్కలేదని చీకట్లో ఆలయాలకు సంబంధించిన రధాలను తగలబెడుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. అధికారం దక్కలేదనే మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏ మాత్రం కూడా సంకోచించడం లేదు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకోవడానికి కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల నిర్మాణాలను ఆపిన సంఘటనలు కూడా మన కళ్లెదుటే కనిపిస్తున్నాయి.అధికారం దక్కలేదని చివరకు పేదపిల్లలకు ఇంగ్లిషుమీడియం చదువులు అందడానికి కూడా వీల్లేదని అంటున్నారు. చివరకి మా వాడు అధికారంలోకి రాకపోతే ప్రతిరోజూ అబద్దాలే వార్తలుగా, వార్తా కథనాలుగా మేము ఇస్తాం. అబద్ధాలనే డిబెట్లుగా ప్రతిరోజూ నడుపుతామని అంటున్న పచ్చ పత్రకలు, పచ్చ ఛానెళ్లను కూడా మన కళ్లెదుటే చూస్తున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
మా వాడు అధికారంలో లేకపోతే, ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజాకొడుకు అని.. బూతులు వాడుతున్నారు. ముఖ్యమంత్రి అంటే కానిస్టిట్యూషనల్ హెడ్.. అలాంటి ముఖ్యమంత్రిని, వాళ్ల తల్లినుద్దేశించి మాట్లాడుతున్న మాటలు, బూతులు తిట్టడాన్ని కూడా ఈ రోజు చూస్తున్నాం. ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రిని అభిమానించేవాళ్లెవరైనా తిరగబడాలి, వాళ్లు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి. దానివల్ల గొడవలు సృష్టించాలని ఆరాట పడటం.. ఇదంతా సమంజసమేనా అని ఒక్కసారి అందరూ ఆలోచన చేయాలి. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఇవాళ చూస్తున్నామని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే అందులో 11 మంది మన రాష్ట్రానికి చెందినవారు. ఇలా గత ఏడాది కాలంలో మరణించిన పోలీసు సోదరుడుకి, సోదరికి ఈ అమరవీరులందరికీ నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని సీఎం చెప్పారు. అధికారం చేపట్టిన నాటి నుంచి సమాజం పట్ల బాధ్యతతో పరిపాలన సాగుతోందని చెప్పారు. పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని, వారికి తగినంత విశ్రాంతి ఉండాలని, ఎప్పుడూ, ఎవరూ కూడా గతంలో ఆలోచన సైతం చేయని విధంగా వారి బాగోగులు కోసం ఆలోచించి దేశంలో ఎక్కడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా వీక్లీ ఆఫ్‌ని ప్రకటించింది ఏపీ ప్రభుత్వమే అని తెలిపారు. కోవిడ్ వలన గత కొంత కాలంగా ఇది అమలు చేయలేకపోయినప్పటికీ, ఇపుడు కోవిడ్ తగ్గుముఖం పడుతున్న నేపధ్యంలో మరలా ఈ వీక్లీఆఫ్ పోలీసులకిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.
అదే విధంగా పోలీసు సంక్షేమానికి గత ప్రభుత్వం 2017 నుంచి బకాయిలు పెట్టిన రూ.15 కోట్లు నిధులు కూడా వారికి విడుదల చేశామని, పోలీస్ శాఖ సిబ్బంది కొరతను భర్తీ చేయడానికి భారీగా ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టబోతున్నామని సీఎం తెలిపారు. పోలీస్ శాఖకు అనుసంధానంగా ఉన్న హోం గార్డుల గౌరవవేతనం కూడా పెంచామని, రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.... పోలీసు శాఖలో 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయాల స్ధాయిలోనే నియమించామని, వారందరికీ శిక్షణా కార్యక్రమం కూడా మొదలవుతుందని చెప్పారు.
కరోనాతో మృతి చెందిన పోలీసు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబాలకు కూడా ఊరటనిస్తూ, కారుణ్య నియామకాలు అన్నీ కూడా నిర్ణీత కాలపరిమితితో నవంబరు 30 తేదీలోగా గడువుపెట్టి మరీ పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. దిశ బిల్లుపై మనం చేయగలిగిన ప్రతి ప్రయత్నం పూర్తి చేస్తూ, ఉభయ సభలు ఆమోదించి, కేంద్రానికి వారి ఆమోదం కోసం ఇప్పటికే పంపించాం అని తెలిపారు.
మారుతున్న సమాజంలో, మారుతున్న టెక్నాలజీతో క్రైం ఇన్వెస్టిగేషన్ నుంచి సైబర్ క్రైం ఇన్వెస్టిగేషన్ వరకు పోలీసుల భాధ్యతలు విస్తరించడం మన కళ్లెదుటే కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. చీకటి ప్రపంచం చేసే నేరాలతో పాటు వైట్ కాలర్ నేరాలను కూడా నిరోధించడం, జరిగిన నేరాలను విచారించడం వరకు పోలీసు విధులు విస్తరించాయన్నారు.
ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ప్రజా ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.