ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 3వ తేదీన విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. మే మూడో తేదీన విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారక రామ తీర్థ సాగర్ ప్రాజెక్టు పెండింగ్ పనులు ప్రారంభిస్తారు. సవరవిల్లిలో జరిగే బహిరంగ సభ తర్వాత ఆయన విశాఖ పర్యటనకు బయలుదేరి వెళుతారు.
మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖకు చేరుకునే ఆయన.. విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 3 వద్ద గల హెలీప్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఐటీ హిల్స్ నెంబరు 4లో గల వేదిక వద్దకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటారు. 2.30 గంటలకు వైజాగ్ ఐటీ టెక్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత స్థానికంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు.
ఈ సందర్భంగా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. తర్వాత మధ్యాహ్నం 3.50 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి రిషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదించి, ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్‌కు, 5.20 గంటలకు విశాఖపట్టణం ఎయిర్‌పోర్టుకు, 6.45 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు.