రేపటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు - వాతావరణ శాఖ హెచ్చరిక

సోమవారం, 1 మే 2023 (11:15 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మే ఒకటో తేదీన ఉమ్మడి గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, మే 1, 2 తేదీల్లో ప్రకాశం, కోనసీమ, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
 
మే రెండో తేదీన మన్యం, అల్లూరి సీతారామ రాజు జిల్లా, తూర్పు గోదావరి, కృష్ణా, ఏలూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలు, పొలాలకు వెళ్లే రైతులు అమరింత అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచన చేసింది. 
 
హైదరాబాద్ నగరంలో కుమ్మేసిన వర్షం  
 
మండు వేసివిలో అకాల వర్షాలు భయపెడుతున్నాయి. హైదరాబాద్ నగరాన్ని మరోమారు ఈ అకాల వర్షాలు కుమ్మేశాయి. దీంతో నగరం మరోమారు తడిసి ముద్దయింది. ఈ వర్షం కారణంగా రోడ్లపై భారీగా నీరు చేయడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమైంది. ఈదురు గాలులతో అనేక ప్రాంతాల్లో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. అకాల వర్షాల సమయంలో నగర వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ నగర మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.
 
ముఖ్యంగా, ఈ వర్షం కారణంగా ఎర్రగడ్డ, సనత్ నగర్, మల్లాపూర్, మోతీ నగర్, జీడిమెట్ల, కాచిగూడ, దిల్ సుఖ్ నగర్, ఖైరతాబాద్, సుచిత్ర, సురారం, గోల్నాక, యూసుఫ్ గూడ, లక్డీకాపూల్, మల్లాపూర్, మాదాపూర్, కూకట్ పల్లి, విద్యానగర్, ఎల్బీ నగర్, అమీర్ పేట, బోరబండ, గచ్చిబౌలి, అంబర్ పేట, రాయదుర్గం, హబ్సిగూడ, తార్నాక, సోమాజిగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
 
ఈ వర్షానికి ఈదురు గాలులు కూడా తోడయ్యాయి. దాంతో పలు ప్రాంతాల్లో చెట్టు విరిగిపడి రహదారులపై పడ్డాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే, చెట్లు విరిగిపడటంతో పాటు రోడ్లపై నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ అకాల భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు పల్లపు కాలనీల్లోకి నీరు వచ్చి చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు