పదేళ్ళ పోరాటం.. ఎందరో త్యాగాలతో సిద్ధించిన పరిశ్రమ : ప్రధానికి జగన్ లేఖ

ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (15:26 IST)
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏపీ రాజకీయాల్లో ఒక్కసారి అలజడి చెలరేగింది. ఇదే అంశంపై ప్రధాని మోడీకి సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ లేఖ కూడా రాశారు. తెలుగు ప్రజల పదేళ్ల పోరాట ఫలితంగా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటైందని, ఎందరో త్యాగాలతో సిద్ధించిన పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తన లేఖలో కోరారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణకు బదులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని సూచిస్తూ శనివారం ఆయన మోడీకి లేఖ రాశారు.
 
'విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు' నినాదంతో నాడు ప్రజలు చేసిన ఉద్యమంలో 32 మంది ప్రాణాలు కోల్పోయారని సీఎం గుర్తుచేశారు. విశాఖ స్టీల్‌ను లాభాల బాట పట్టించేందుకు కేంద్ర ఉక్కుశాఖతో కలిసి పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 
 
ప్లాంటును బలోపేతం చేసే మార్గాలు అన్వేషించాలని కోరారు. 2020 డిసెంబరులో రూ.200 కోట్ల లాభం వచ్చిందని, మరో రెండేళ్లపాటు చేయూతనందిస్తే ఆర్థిక సుస్థిరత సాధిస్తుందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కు సొంతంగా ఇనుప ఖనిజ గనులు లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చు విపరీతంగా పెరిగిపోయిందని, దీంతో నష్టాలు వాటిల్లాయని సీఎం వివరించారు. 
 
ప్లాంటు విస్తరణ కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులపై వడ్డీ ఎక్కువగా ఉండడం కూడా పరిశ్రమకు భారంగా మారిందన్నారు. ముఖ్యంగా సొంత గనులు లేకపోవడం వల్ల ఎన్‌ఎండీసీకి చెందిన బైలదిల్లా గనుల నుంచి మార్కెట్‌ ఖరీదుకు ముడి ఖనిజాన్ని కొనుగోలు చేస్తోందని, దీనివల్ల టన్నుకు అదనంగా రూ.3,472 చొప్పున భారం పడుతోందని వివరించారు. 
 
ప్లాంటుకున్న రూ.22,000 కోట్ల రుణంపై అత్యధికంగా 14శాతం వడ్డీ రేటు అమలవుతోందని, దీన్ని తప్పించేందుకు మొత్తం రుణాన్ని ఈక్విటీ రూపంలోకి మార్చి స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. దీనివల్ల వడ్డీ భారం తొలగిపోతుందని, ప్రజలకు వాటాలను అందుబాటులోకి తేవడం ద్వారా బ్యాంకుల పాత్రను తప్పించవచ్చని సూ చించారు. ప్రస్తుతం ప్లాంటు అప్పులపై ఉన్న అధికశాతం వడ్డీని తగ్గించాలని లేఖలో సీఎం కోరారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు