కేంద్రం మూడు కొత్త వ్యవసాయ సాగు చట్టాలను తీసుకొచ్చింది. ఈ సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దులో రైతులు పట్టువిడవకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. అయితే, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ మాత్రం వెనక్కి తగ్గకపోవడంతో ఆయన తల్లికి పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ అనే రైతు తాజాగా ఓ లేఖ రాశాడు.
ఈ చట్టాలను ఎందుకు రద్దు చేయాలో కూడా ఆ రైతు పూర్తిగా వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవసాయ చట్టాలను అదానీ, అంబానీతో పాటు బడా కార్పొరేట్లకు మేలు చేసేలా రూపొందించారని చెప్పాడు. తల్లి మాటను ఎవరూ కాదనరని, అందుకే మోడీ తల్లిగా హీరాబెన్ ఆయనకు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సూచన చేయాలని ఆ రైతు రాసిన లేఖలో పేర్కొన్నారు.