కేంద్రానికి, జాతీయ మీడియాకు దక్షిణాదిపై చిన్నచూపని జనసేన అధినేత పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. జల్లికట్టు, ప్రత్యేక హోదా అంశాలతో కేంద్రంపై ప్రజలకు వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. తెలంగాణలో 1500మంది చనిపోతే గానీ, అటు కేంద్రం, ఇటు జాతీయ మీడియా పట్టించుకోలేదని పవన్ మండిపడ్డారు.
ఢిల్లీలో తుమ్మినా, కాలు జారిపడినా జాతీయ మీడియాకు వార్తేనని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. జాతీయ మీడియా దక్షిణాది కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. హిందీని తాము గౌరవిస్తామని.. దక్షిణాదిని కూడా గౌరవించాలని పవన్ మీడియాకు సూచించారు.
దక్షిణాది కాబట్టే అర్థరాత్రి రాష్ట్రాన్ని విడగొట్టేశారని, అదే మహారాష్ట్ర నుంచి విదర్భను గానీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని గానీ విడగొట్టలేకపోతున్నారని తెలిపారు. కేంద్రానికి మెజార్టీ.. అలాంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలను ఎందుకు విడగొట్టట్లేదని పవన్ ప్రశ్నించారు. ఏపీకి హోదా ఇస్తామంటారు? అవసరమా అంటారు? గానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తనకు ఎవరూ భయపడటం లేదని, అలా అనుకోవడం అవివేకమవుతుందని.. తన డిమాండ్లపై చంద్రబాబు స్పందించడంపై పవన్ అన్నారు.
ప్రత్యేక హోదా అంశంలో కేంద్రం వైఖరిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఖండించారు. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రం ఎన్నో ప్రయోజనాలు కోల్పోతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్ర సాయం అవసరమని పేర్కొన్నారు. పవన్ ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.