ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం కోలాహలంగా ఉండగా, సమయానికి రాష్ట్ర గవర్నర్ రాష్ట్రంలో లేరు. ఆయన అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు. అయితే, ఇపుడే రాష్ట్రానికి శుభ వార్త అందింది. గవర్నర్ కోలుకున్నారు. విజయవాడ చేరుకోనున్నారు.
కరోనా నుండి పూర్తిగా కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం మధ్యాహ్నం విజయవాడ చేరుకోనున్నారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. రాష్ట్ర గవర్నర్ డిల్లీ పర్యటన అనంతరం ఆయనకు కరోనా లక్షణాలు బయట పడ్డాయి. ప్రాథమిక దశలోనే కరోనా లక్షణాలు బయటపడటంతో వెంటనే గుర్తించి వైద్యులు చర్యలు ప్రారంభించారు.
ఈ నెల 15న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హైదరాబాద్ ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో జాయిన్ అయ్యారు. అక్కడ గవర్నర్ చేరిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి, చికిత్స ఎలా జరుగుతోందో అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ కొంత కోలుకున్న తర్వాత స్వయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పలకరించారు. బాగున్నారా అని, పరామర్శించి, ఆయన వేగంగా కోవాలని ఆకాంక్షించారు. మరో పక్క ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కూడా గవర్నర్ ని పలకరించారు.
అక్కడ ఆసుపత్రిలో మెరుగైన చికిత్సతో వేగంగా కోలుకున్న గవర్నర్ మంగళవారం ఉదయం 12గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఒంటి గంటకు విజయవాడ - గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో షెడ్యూలును అనుసరించి 1.30 గంటలకు రాజ్ భవన్ కు తిరిగి వస్తారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా పేర్కొన్నారు.