ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ నెలలో ప్రారంభంకావాల్సిన పాఠశాలలకు నెలాఖరు వరకు సెలవులు పొడగించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు తదితర అన్ని యాజమాన్యాలలో గల స్కూళ్లలో చదువుతున్న 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ఈనెల 30తో ముగుస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం సెలవులను జూన్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పదో తరగతి పరీక్షలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కరోనా అదుపులోకిరాని పరిస్థితులు, టీచర్లు అనేక మంది కరోనా బారినపడి చనిపోతుండడంతో విద్యారంగంలో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల సూచనల మేరకు ప్రభుత్వం సెలవులు పొడిగించింది.
అయితే టీచర్లు, ప్రధానోపాధ్యాయులు మాత్రం పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి ఇప్పట్లో అంతమయ్యే పరిస్థితులు లేకపోవడం.. ప్రత్యక్ష క్లాసులు ఇప్పట్లో మొదలుపెట్టడం ప్రమాదకరంగా కనిపిస్తుండడంతో విద్యార్థులకు డీడీ, రేడియో, యూట్యూబ్ వంటి మాధ్యమాల ద్వారా ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించడానికి వీలుగా ప్రణాళికల సిద్ధం చేయాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ను ఆదేశించింది.