సీఎం జగన్ పాలనలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు... ఆస్పత్రులకు లైసెన్సులు రద్దు

వరుణ్

శుక్రవారం, 26 జనవరి 2024 (15:36 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనపై ఆరోగ్య సేవలు నిలిచిపోయాయి. ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించకపోవడంతో గురువారం నుంచి ఈ సేవలను ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు నిలిపివేశాయి. దీంతో ఏపీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేస్తుంది. ఈ కోవలో సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఏకంగా 17 ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంది.
 
ప్రస్తుతం ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.1200 కోట్ల బకాయిలను చెల్లించాల్సివుంది. వీటిని విడుదల చేయాలని ఆస్పత్రి యాజమాన్యాలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. ఈ విషయంపై గత 20 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం సానుకూల హామీ రాకపోవడంతో ఆగ్రహించిన ఆస్పత్రుల యాజమాన్యం.. గురువారం నుంచి వైద్య సేవలను నిలిపివేశారు. 
 
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా ప్రభుత్వానికి ఆస్పత్రుల యాజమాన్యాలు తేరుకోలేని షాకిచ్చాయి. కడపలోని 18 ఆస్పత్రులకు గానీ, 17 ఆస్పత్రులు ఈ ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశాయి. ఆరోగ్య శ్రీ పథకం కింద సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటన బోర్డులు పెట్టాయి. దీంతో ఆయా ఆస్పత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం.. ఆ 17 ఆస్పత్రుల లైసెన్సులు రద్దు చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, రాజమండ్రిలో 14, విశాఖపట్టణంలో నాలుగు ఆస్పత్రులకు లైసెన్సులను ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సస్పెండ్ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు