భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

సిహెచ్

బుధవారం, 10 సెప్టెంబరు 2025 (13:36 IST)
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆమెకి ఎల్లప్పుడూ సహాయం చేసేందుకు సిద్ధంగా వుండాలి. ఆమెకి మానసికంగా, శారీరకంగా అండగా ఉండటం చాలా ముఖ్యం. ఈ సమయంలో భర్త చేయకూడనివి, జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని విషయాలు తెలుసుకుందాము. భార్యను ఒత్తిడికి గురి చేయకూడదు. గర్భం అనేది స్త్రీ శరీరంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఈ సమయంలో భార్యకు మానసిక ఒత్తిడి కలిగించే పనులు, మాటలు చెప్పవద్దు. ఆమెకు విశ్రాంతి, సంతోషం కలిగించే వాతావరణం సృష్టించాలి.
 
బరువు పెరగడం, శరీరంలో మార్పుల గురించి ఎగతాళి చేయడం లేదా విమర్శించడం చేయవద్దు. ఆమెకు ధైర్యాన్ని, ప్రేమను అందించాలి. పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు వుంటే భార్య కోసం మానేయాల్సిందే. గర్భిణిగా ఉన్నప్పుడు భర్త పొగతాగడం, మద్యం సేవించడం వల్ల ఆ వాసనలు ఆమెకు వికారం కలిగించవచ్చు. అంతేకాక, పరోక్ష ధూమపానం కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి హానికరం.
 
ఇంటి పనులు, బరువులు ఎత్తడం వంటివి ఆమె ఒక్కతే చేయనివ్వకుండా భర్త సహాయం చేయాలి. ఆమె ఇష్టం లేకుండా శారీరక సంబంధం పెట్టుకోరాదు. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల భార్య మానసిక, శారీరక స్థితి మారవచ్చు. ఆమెకు సౌకర్యంగా లేనప్పుడు ఒత్తిడి చేయకూడదు.
 
డాక్టర్ అపాయింట్‌మెంట్స్ విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ఆమెను డాక్టర్ అపాయింట్‌మెంట్స్‌కి ఒంటరిగా పంపించడం చేయరాదు. భర్త కూడా ఆమెతో పాటు వెళ్లి అండగా ఉండాలి. గర్భధారణ సమయంలో ఆమెకు అనేక అనుమానాలు, భయాలు ఉంటాయి. వాటిని అశ్రద్ధ చేయకుండా, ఆమె చెప్పేది వినాలి. అవసరమైతే డాక్టర్ సలహా తీసుకోవడం గురించి చర్చించాలి. ఈ సమయంలో భర్త, భార్యకు తోడుగా ఉంటే గర్భధారణ ప్రయాణం ఆమెకు సులభంగా, సంతోషంగా మారుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు