నిజమే.. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారంగా మారాయి : మంత్రి ధర్మాన ప్రసాద రావు

గురువారం, 14 డిశెంబరు 2023 (12:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు భారంగా మారాయని రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. అయితే, దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ విద్యుత్ చార్జీలతో పాటు అన్ని రకాల ధరలు పెరిగాయని చెప్పరాు. ఈ ధరల పెరుగుదల అనేది కేంద్రం చేతిలో ఉంటుందని ఆయన సెలవిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో బుధవారం జరిగిన సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 
 
ప్రజలకు లబ్ధి చేకూరేలా పథకాలు, ఇళ్లు ఇస్తుంటే ప్రతిపక్షాలు రోడ్లు బాగా లేవని గుంతలు చూపిస్తున్నాయన్నారు. ఏడాది సమయం ఇస్తే రోడ్లు వేస్తామన్నారు. స్థూల జాతీయోత్పత్తిలో రాష్ట్రం నాలుగేళ్లలో ప్రగతి సాధించిందన్నారు. గతంలో 14 ఏళ్ల పాటు చంద్రబాబు పాలనలో ప్రగతి కనిపించలేదని తెలిపారు. 
 
అలాగే, స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలందరికీ విద్య, వైద్యం, సంక్షేమం అందించామని, తెలుగుదేశం ప్రభుత్వం గతంలో జన్మభూమి కమిటీల పేరుతో పేదలకు పథకాలు అందకుండా చేసిందన్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ గత ప్రభుత్వం వంశధార నిర్వాసితులకు అన్యాయం చేసి, అడ్డగోలుగా నిర్వాసితులను ఖాళీ చేయించిందని చెప్పారు.
 
మరోవైపు, సామాజిక సాధికార యాత్ర సభతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. సభా వేదికను పాతపట్నం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పాతపట్నం లోపలికి వైకాపా జెండా ఉన్న వాహనాలనే అనుమతించడంతో పోలీసులపై స్థానికులు మండిపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు