నాని సంచలన వ్యాఖ్యలు : ఏ ఒక్కడినీ వదిలిపెట్టం.. జగన్ బాటలో కేంద్రం

ఆదివారం, 30 మే 2021 (12:31 IST)
ఏపీ మంత్రి కొడాలి నాని మరోమారు టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. తప్పు చేసిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టం అంటూ హెచ్చరించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, 2004, 2009లోనూ చంద్రబాబును వైఎస్ఆర్ ఓడించారని ఆయ‌న గుర్తు చేశారు. 2019లో వైఎస్ జగన్‌ను కూడా ప్ర‌జ‌లు భారీ మెజార్టీతో గెలిపించారని తెలిపారు. 
 
గ‌తంలో వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబు సీఎం అయ్యారని ఆయ‌న ఆరోపించారు. జ‌గ‌న్ మాత్రం ప్రజల మద్దతుతో ఎన్నికయ్యార‌ని చెప్పుకొచ్చారు. తాము కరోనా సంక్షోభం స‌మంయ‌లోనూ ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామ‌ని చెప్పారు. 
 
చంద్ర‌బాబు నాయుడు గంటకో మాట, పూటకో మాట మాట్లాడుతారని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రజల సొమ్మును దోచుకున్న వారిని తాము వదిలిపెట్టబోమ‌ని తెలిపారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, అలాగే, క‌నీసం ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్ మళ్లీ అధికారంలోకి వస్తాడా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 
 
దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకుని వచ్చినా చంద్రబాబు నాయుడు గెలవలేడని ఆయ‌న జోస్యం చెప్పారు. ఆయ‌న‌కు 2014లో అధికారం ఇచ్చి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని నాని చెప్పారు. చంద్రబాబుకు గ‌తంలో అధికారం అప్పగించినందుకు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా నాశనం చేశారని ఆయ‌న వ్యాఖ్యానించారు.
 
జ‌గ‌న్ పాల‌న‌లో ప్రజా సంక్షేమం కొన‌సాగుతోంద‌ని చెప్పారు. కరోనా వ‌ల్ల‌ అనాథలైన పిల్లలకు రూ.10 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశామ‌ని చెప్పారు. జగన్‌ బాటలోనే కేంద్ర ప్రభుత్వం కూడా నడిచిందని చెప్పుకొచ్చారు. జగన్ పాలనలో విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయ‌న చెప్పారు. కానీ, చంద్ర‌బాబు మాత్రం ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డమైన హామీలు ఇచ్చారని నాని అన్నారు.
 
త‌మ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు. రెండేళ్లలో సంక్షేమ కార్యక్రమాలను పెద్దఎత్తున అమలు చేశామ‌ని తెలిపారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రాకుండా చంద్ర‌బాబు నాయుడు అడ్డుపడ్డార‌ని కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబు నాయుడిని న‌మ్మే ప‌రిస్థితుల్లో ప్రజలు లేర‌ని ఆయ‌న చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు