నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషి ఫలిస్తోంది. మంత్రి చొరవతో అధికారులు చర్యలు చేపట్టారు. నేపాల్ నుంచి పలువురు యాత్రికులు కాసేపట్లో రాష్ట్రానికి బయల్దేరనున్నారు. సిమికోట్‌లో చిక్కుకున్న 12 మందిని ప్రత్యేక విమానంలో అధికారులు ఉత్తర్‌ప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న నేపాల్ గంజ్ ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు.
అక్కడి నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనాల్లో లక్నో చేరుకోనున్నారు. లక్నో నుంచి హైదరాబాద్‌కు విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాట్మండు సమీపంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి లోకేశ్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. నేపాల్‌లో చిక్కుకున్న వారు రాష్ట్రానికి సురక్షితంగా తిరిగివచ్చి ఇళ్లకు చేరే వరకూ సంబంధిత అధికారులు అంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే.