అతివేగం... హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. మంత్రి నారాయణ కుమారుడు దుర్మరణం

బుధవారం, 10 మే 2017 (07:32 IST)
హైదరాబాద్ నగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీ మంత్రి పి.నారాయణ కుమాడు దుర్మరణం పాలయ్యాడు. అతనిపేరు నిషిత్ నారాయణ. వయసు 23 యేళ్లు. అలాగే, అతని స్నేహితుడు రాజా రవివర్మ కూడా మృత్యువాతడ్డాడు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది.
 
మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని జీహెచ్‌ఎంసీ సిబ్బంది అపోలో ఆస్పత్రికి తరలించేలోవు వారు మరణించారు. వీరిద్దరూ మద్యం సేవించి ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధృవీకరించలేదు. 
 
ప్రమాద సమయంలో వీరిద్దరూ సీటు బెల్టు పెట్టుకోలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును అక్కడి నుంచి తీసివేశారు. ప్రమాదం బుధవారం వేకువజామున ఉదయం 3 గంటలకు జరిగింది. మృతి చెందింది మంత్రి కుమారుడనే విషయాన్ని పోలీసులు వచ్చే వరకు తెలియలేదు.
 
నిషిత్ ప్రయాణించిన బెంజ్ కారు నెంబర్ టీఎస్ 07 ఎఫ్‌కే 7117 అని సమాచారం. ఈ ఏడాదే నారాయణ గ్రూప్స్ డైరెక్టర్‌గా నిషిత్ బాధ్యతలు చేపట్టారు. స్నేహితుడు రాజా రవివర్మతో కలిసి నిషిత్ బెంజ్ కారులో వెళ్తుండగా, జూబ్లీహిల్స్ రోడ్డు నెం.36లో వీరి వాహనం మెట్రో పిల్లర్‌ను అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 
 
ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ కుమారుడి మరణ వార్త వినగానే హుటాహుటిన భారత్‌కు బయలుదేరారు. నిశిత్ మరణ వార్తను విన్న మంత్రి నారాయణ భార్య,  కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆస్పత్రికి చేరుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి