నోరు తెరిస్తే పచ్చి అబద్దాలే... పెన్నూ పేవర్ ఉందికదానీ...

బుధవారం, 28 అక్టోబరు 2020 (16:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైకాపా పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘంపై చేసిన ఆరోపణలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముక్తకంఠంతో ఖండించారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఆరోగ్యశాఖ అధికారులను సంప్రదించడం లేదన్న వైసీపీ ప్రకటనల్లో నిజం లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ కొట్టిపారేశారు. 
 
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆయన బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మొత్తం 11 రాజకీయ పార్టీలు హాజరుకాగా, రెండు పార్టీలు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. అధికార వైకాపాతో సహా ఆరు పార్టీలు మాత్రం అఖిలపక్షానికి దూరంగా ఉన్నాయి. 
 
ఈ సమావేశం తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, కరోనా పరిస్థితిపై ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వైద్యారోగ్యశాఖ కమిషనర్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు. సీఎస్ నీలం సాహ్ని అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. అందరితోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సీఈసీ అనుసరిస్తున్న విధానాలనే రాజకీయపక్షాల గుర్తింపు, సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా అమలు చేసినట్లు వివరించారు. 
 
కోవిడ్-19 మార్గదర్శక సూత్రాలను పాటించినట్లు చెప్పుకొచ్చారు. సామాజిక దూరం, జాగ్రత్తలను అనుసరించడానికి, సమయ స్లాట్‌లతో వ్యక్తిగత సంప్రదింపులు ఉత్తమమైందిగా భావించినట్లు చెప్పారు. సురక్షితమైన అంశంగా భావించి ఈ విధానాన్ని అమలు చేసినట్లు స్పష్టంచేశారు. సంప్రదింపు ప్రక్రియలో వచ్చిన ఏకాభిప్రాయాలను, అభిప్రాయాలను గౌరవించాలని కమిషన్ కోరుకుంటుందని నిమ్మగడ్డ తెలిపారు.

ఎన్నికల కమిషన్ కాదు.. నిమ్మగడ్డ కమిషన్ : ఏపీ మంత్రి కన్నబాబు 
ఆంధ్రప్రదేశ్‌లో ఉండేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదని, అది నిమ్మగడ్డ కమిషన్ అని ఏపీ మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత అహం కోసం, ఇష్టాల కోసం ఎన్నికల సంఘాన్ని నిమ్మగడ్డ రమేశ్ నడుపుతున్నారని మండిపడ్డారు.
 
ప్రభుత్వంతో చర్చించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలను రమేశ్ వాయిదా వేశారని... ఆయనేంటో అప్పుడే జనాలకు అర్థమైందన్నారు. కనీసం ముఖ్యమంత్రికి కూడా చెప్పకుండానే ఎన్నికలను వాయిదా వేశారని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే ఆయన లక్ష్యమని... అదే ఉద్దేశంతో ఉన్నవారికి ఆయన సహకరిస్తున్నారని ఆరోపించారు.
 
కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించే అంశంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి అధికార పార్టీ డుమ్మా కొట్టింది. ఈ వ్యవహారంపై మంత్రి కన్నబాబు మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలనుకుంటున్న పార్టీలతో నిమ్మగడ్డ సమావేశం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. 
 
ఏపీలో ఫ్యాక్షనిస్టు ప్రభుత్వం ఉందని విమర్శిస్తూ గతంలో కేంద్ర ప్రభుత్వానికి నిమ్మగడ్డ లేఖ రాశారని గుర్తుచేశారు. సీఎం జగన్‌కు వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదన్నారు. వ్యవస్థల పనితీరుపైనే ఆయన ఆలోచిస్తున్నారని... ఎన్నికల కమిషన్ ఇలా పని చేయడం కొనసాగిస్తే... భవిష్యత్తులో అది ఆనవాయతీగా మారుతుందన్నారు. 
 
ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చిన తాము ఎలక్షన్లకు ఎందుకు భయపడతామని ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ ఎన్నికలను నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేశ్ సిద్ధమైతే... ఉన్నత స్థాయిలో చర్చించి ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. 
 
అయినా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుంటే ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని మంత్రి కన్నబాబు సందేహం వ్యక్తం చేశారు. గతంలో కరోనా వైరస్ బూచి చూపే కదా స్థానిక సంస్థల ఎన్నికలను అర్థాంతరంగా వాయిదావేశారు అంటూ మంత్రి చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు