తీవ్ర తుఫానుగా ఫణి : విశాఖ తీరానికి 670 కిమీ దూరంలో...

మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (15:22 IST)
గడచిన నాలుగు రోజులుగా బంగాళాఖాతంలో తిరుగుతూ అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారి, తుఫానుగా రూపాంతరం చెందిన 'ఫణి' ఇప్పుడు అతి తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 690 కిలోమీటర్లు, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 760 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాను, మరికొన్ని గంటల్లో పెను తుఫానుగానూ మారుతుందని, ఇది ఎక్కడ తీరం దాటుతుందన్న విషయాన్ని ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా చెప్పే పరిస్థితి లేదని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
 
మరోవైపు, తీవ్ర తుఫానుగా మారిన ఫణి ప్రమాద ఘంటికలు మోగిస్తూ తీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం ఇది విశాఖ తీరానికి 670 కిలో మీటర్లు, పూరి తీరానికి 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. బుధవారం ఇది మరింత బలపడి పెను తుఫానుగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఓడరేవులకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో, కాకినాడ, గంగవరం రేవుల్లో ఐదో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, విశాఖపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో నంబర్ హెచ్చరికలు జారీ చేశారు. 
 
బుధవారం నుంచి 4వ తేదీ వరకు తుపాను ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్తాపై తుఫాను ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు తుఫాను సహాయ నిధి కింద కేంద్రం రూ.200 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని ఎన్డీఆర్ఎఫ్ కింద మంజూరు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు