రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని వృద్ధి చేసేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. టూరిజం ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందడుగేస్తోంది. పర్యాటక రంగంలో ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తన ఆకర్షించి రాష్ట్ర వృద్ధి రేటును పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి దేశీయంగా, అంతర్జాతీయంగా పర్యాటకుల వెల్లువలా వస్తున్న నేపథ్యంలో వచ్చే రోజుల్లో పర్యాటక రంగాన్ని దిశా దశ మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 146 ప్రాజెక్టుల ద్వారా 32,242 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కృతనిశ్చయంతో ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ప్రణాళికలు సైతం రూపొందించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే పర్యాటక రంగం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై కీలక చర్చలు జరుపుతున్నారు. ఇన్ క్రిడిబుల్ ఇండియాలోనూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మార్పుల గురించి ఆంధ్రప్రదేశ్ కు రండని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలకు ఏపీలోకి వస్తే ఎర్ర తివాచీ పరుస్తామని... కొత్త రాష్ట్రంలో పర్యాటకానికి అర్థాన్ని పునర్ నిర్వచిస్తున్నామని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో 11 వేల 694 కోట్ల రూపాయలతో 146 ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆయా ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధికి దోహదకారి కావడంతోపాటు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కొత్త రాష్ట్రంలోని యువతకు పర్యాటక రంగంలో ఉపాధి కల్పించడం, పెట్టుబడులను పూర్తి స్థాయిలో వచ్చేలా కార్యాచరణ చేపట్టడం వల్ల భారీగా వృద్ధి రేటు పెరగుతుందని సర్కారు అంచనా వేస్తోంది.
రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడుల అంచనా, వాటి తాజా పరిస్థితులకు సంబంధించిన వివరాలను పర్యాటక శాఖ వెబ్ సైట్ తోపాటు, సీఎం డ్యాష్ బోర్డు ద్వారా వివరాలు అందిజేస్తోంది. ఆయా ప్రాజెక్టులను ఏడు కేటగిరీలుగా విభజించి వాటి ప్రస్తుత పరిస్థితిని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన ప్రాజెక్టులను జీ-1 కేటిగిరిగా పేర్కొన్నారు. ఈ కేటిగిరిలో 28 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయా ప్రాజెక్టుల్లో మొత్తం రూ. 455 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 2562 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. జీ 2 కేటగిరి కింద మరో రెండు ప్రాజెక్టుల ట్రయల్ బేసిస్ లో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా రూ. 69 కోట్ల పెట్టుబడులు రాగా... 377 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. కీలకంగా మారుతున్న ప్రాజెక్టుల జీ-4లో ఉన్నాయి. ఈ కేటిగిరి ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 17 ప్రాజెక్టులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రాజెక్టుల కింద రూ. 1247 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 3118 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టుల సివిల్ వర్క్సు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
జీ-1, జీ-2 జీ-4 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత క్రమంలో నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా త్వరిగతగతిన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని 6057 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో రూ. 1771 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఇప్పటికే కొన్ని పెట్టుబడులు వచ్చి ఉపాధి అవకాశాలు కల్పించబడ్డాయి. మరికొన్ని ప్రాజెక్టులు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఇక రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురావాలనుకుంటున్న ప్రాజెక్టులను ఆర్ 1, ఆర్ 2, ఆర్ 3, ఆర్ 4 కేటగిరీలుగా పేర్కొన్నారు. ఆర్ 1 కేటగిరి కింద రూ. 61 కోట్లతో 2 ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ ప్రాజక్టుల వల్ల 100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. భూసేకరణ పూర్తయింది. ఇక ఆర్ 2 కేటగిరి కింద 30 ప్రాజెక్టులు రాబోతున్నాయి. ఈ ప్రాజెక్టులకు భూమి స్వాధీనంలో ఉంది. అనుమతులు మంజూరు కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో రూ. 1683 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఈ ప్రాజెక్టులతో 3148 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆర్ 3 కేటగిరి కింద 42 ప్రాజెక్టులను రూ. 6812 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 17,350 మందికి ఉపాధి అవకాశాల కల్పన జరుగుతుంది. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వ స్థలాలను కోరడం జరిగింది. ఆయా ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాన్ని భూములు కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు భూములు కేటాయించలేదు. ఆర్ 4 కేటగిరి కింద 25 ప్రాజెక్టులు ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి డీటేల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) ప్రభుత్వానికి అందింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ. 1367 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా 5587 మందికి ఉద్యోగాల కల్పన జరగనుంది.
రాష్ట్రంలో పర్యాటక రంగంలో సమూల మార్పులకు త్వరలో రానున్న ప్రాజెక్టులు కేంద్ర బిందవుకానున్నాయి. ఆర్1, ఆర్ 2, ఆర్ 3, ఆర్ 4 కింద ఏర్పాటు చేసే ప్రాజెక్టులతో మొత్తం రూ. 9923 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా 99 ప్రాజెక్టులు ద్వారా 26185 మంది యువతకు ఉపాధి అవకాశాలు వివిధ మర్గాల్లో కల్పించబడతాయి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా రూ. 11,694 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా 32,242 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మొత్తం 146 ప్రాజెక్టులతో రాష్ట్ర పర్యాటక రంగం కొత్త రూపు సంతరించుకోనుంది.