ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య శ్రీ పథకం మరో ఆరు జిల్లాలకు చేరనుంది. రాష్ట్రంలోని నిరుపేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీలో మరిన్ని మార్పులకు శ్రీకారం కూడా చుట్టారు. అందులో భాగంగా వైద్యం ఖర్చు రూ.1000లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ ప్రక్రియలోకి కొత్తగా మరో 6 జిల్లాలను చేర్చారు. ఈ మేరకు గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో వైద్యం ఖర్చు రూ.1000లు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపజేయడానికి అధికారులకు జగన్ ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని మరింత పటిష్టంగా అమలుకు విధానాలను రూపొందించారు. అలాగే అమలయ్యే వైద్య ప్రక్రియల సంఖ్యను 2059 నుంచి 2146కు పెంచారు. ఆరోగ్యశ్రీ క్రింద సంపూర్ణ క్యాన్సర్ చికిత్సలో భాగంగా మరో 54 వైద్య ప్రక్రియలను కూడా అందించ బోతున్నారు. మొత్తం 2200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ క్రింద ప్రభుత్వం ఉచితంగా అందించబోతోంది.
ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించడంతో పాటు నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆరోగ్యశ్రీ బిల్లులను కూడా ఎప్పటికప్పుడు చెల్లించి, మెరుగైన వైద్య సేవలందించేలా నిర్ణయాలు అమల్లోకి తీసుకొచ్చారు.