తెలంగాణాలో కాంగ్రెస్‌కు మద్దతివ్వండి.. చంద్రబాబు లేఖ.. అది వైకాపా ఫేక్ లెటర్

గురువారం, 9 నవంబరు 2023 (08:36 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ నెలాఖరులో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో అధికార భారాస, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ త్రిముఖ పోటీ గెలుపు కోసం మూడు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే, తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ పోటీ నుంచి తప్పుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడం, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉంది. 
 
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని కమ్మ సామాజిక వర్గంతో పాటు టీడీపీ అభిమానులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టించింది. దీనిపై ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు స్పందించారు. ఆ లేఖ ఫేక్ అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు వైకాపా కుట్రలకు తెరలేపిందని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన అధికారంగా ఓ ప్రకటన విడుదల చేశారు. 
 
"వైకాపా బతుకే ఓ ఫేక్. ఫేక్ ప్రచారాలు, ఈ లేఖలనే ఆ పార్టీ నమ్ముకుందని విమర్శించారు. చంద్రబాబు రాసినట్టు ఓ లేఖను వైకాపా ప్రచారంలో పెట్టడాన్ని ఖండించారు. చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్రలకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు గానీ, అభిమానులకు గానీ ఎవరికీ ఓటు వేయాలనే విషయంలో చంద్రబాబు ఎలాంటి సూచన, విజ్ఞప్తి చేయలేదని స్పష్టం చేశారు. లేఖలో చంద్రబాబు ఫోర్జరీ సంతకంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష పార్టీలు నేతలపై అసత్య ప్రచారానికి పాల్పడుతున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాల"ని ఆయన డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు