ఏపీలో రోజుకో రికార్డు : ఆరోగ్య మంత్రి పేషీలోని అటెండర్‌కు కరోనా

బుధవారం, 29 ఏప్రియల్ 2020 (10:53 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో రికార్డు నమోదవతోంది. రెండు రోజుల క్రితం ఆ రాష్ట్ర రాజ్‌భవన్ ఉద్యోగుల్లో నలుగురికి కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పని చేసే ఓ అటెండర్‌కు ఈ వైరస్ సోకింది. ఇపుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేషీలో అటెండర్‌గా పని చేస్తున్న ఉద్యోగికి ఈ వైరస్ సోకింది. దీంతో మంత్రి పేషీలోని సిబ్బంది తీవ్ర ఆందోలకు లోనవుతున్నారు. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ కేసుల నమోదులో ఏపీ సరికొత్త రికార్డును నెలకొల్పుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరోనా హాట్ స్పాట్ కేంద్రాలుగా నిలిచాయి. ఈ పరిస్థితుల్లో అటు రాజ్‌భవన్, ఇటు సచివాలయ ఉద్యోగులకు ఈ వైరస్ సోకింది. ఇపుడు ఆరోగ్య శాఖ పేషీకి వ్యాపించింది. దీంతో అటు ప్రభుత్వం, ఇటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 
 
ఆరోగ్య శాఖలోని మంత్రి పేషీలో పని చేస్తున్న ఓ అటెండర్‌కు నిర్వహించిన ట్రూనాట్ పరీక్షల్లో ప్రిజంప్టివ్ పాజిటివ్ రావడం కలకలం రేపింది. దీనిని పూర్తిస్థాయిలో నిర్ధారించుకునేందుకు ఆ శాంపిల్‌ను వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. బాధిత అటెండర్‌ను పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాలకు పంపారు. విషయం తెలిసిన వెంటనే నాని, ఆయన భద్రతా సిబ్బందితోపాటు పేషీలోని అధికారులు, ఉద్యోగులు కలిపి మొత్తం 12 మందిని పరీక్షించారు. వీరికి సంబంధించిన పరీక్ష ఫలితాలు గత అర్థరాత్రి రాగా, అందరికీ నెగటివ్ అని తేలినట్టు వైరాలజీ ల్యాబ్ అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు