జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (16:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో ఆకర్షణీయమైన పథకాన్ని ప్రారంభించారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన జగనన్న విద్యా పథకానికి ఆయన మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు. 
 
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 'జగనన్న విద్యా దీవెన' పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైఎస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ పథకాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ పథకం తీసుకువచ్చారని.. అంతవరకూ ఎవరూ కూడా దీని గురించి ఆలోచన చేయలేదని గుర్తుచేశారు. 
 
బోర్డింగ్‌, లాడ్జింగ్‌ కోసం వసతి దీవెన, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం విద్యా దీవెన అనే రెండు పథకాలను తీసుకోచ్చామని తెలిపారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.4 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్‌ అందజేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,880 కోట్ల బకాయిలను కాలేజీలకు చెల్లించినట్టు ఆయన తెలిపారు. 
 
అంతేకాకుండా, ప్రస్తుతం కరోనా వైరస్ కష్టాలు చుట్టుముట్టినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. అందువల్ల గడచిన సంవత్సరాల్లో అడ్మిషన్లు తీసుకున్న వారే కాకుండా.. పై తరగతులు చదువుతున్న వారికి కూడా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపచేస్తున్నట్టు చెప్పారు. 
 
స్పెషల్‌ ఫీజులు.. ఇతరత్రా ఫీజులు కూడా ఉండవు. ఎవరైనా తల్లిదండ్రులు.. ఇప్పటికే కాలేజీలకు ఫీజు కట్టి ఉంటే.. ఇప్పుడు కాలేజీ యాజమాన్యాలకు పూర్తి ఫీజులు చెల్లిస్తున్నాం కాబట్టి.. ఆ డబ్బును తల్లిదండ్రులకు వెనక్కి ఇవ్వాలని ఆయన ఆదేశించారు. 
 
తల్లిదండ్రులకు లేఖలు కూడా రాశాం... గ్రామ వాలంటీర్ల ద్వారా అవి చేరుతాయి. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యాలకు కూడా చెప్పడం జరిగింది. లేకుంటే 1902 నంబర్‌కు తల్లిదండ్రులు తమ సమస్యను చెప్పవచ్చని ఆయన తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు