దేవుడి పాదాన్ని తాకితే భక్తుడి జన్మధన్యమైపోతుంది. కానీ, అనంతపురం జిల్లాలో మాత్రం భూతప్ప పాదాల కింద నలిగితే మాత్రం బిడ్డలు పుడుతారట. అతని పాదాల్లో ఉన్న మాయామర్మమేంటో ఆ మహిళా భక్తులకే తెలియాలి. ఇంతకీ ఈ భూతప్ప కథేంటో ఓసారి తెలుసుకుందాం.
అనంతపురం జిల్లా మడకశిర మండలంలోని భక్తరహళ్లి లక్ష్మీనరసింహ స్వామి, జిల్లేలుడుగుంట ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతియేటా బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు ఉత్సవమూర్తులను తీసుకొచ్చే అర్చకుల ముందు భూతప్పలు వేషాలు ధరించిన కొంతమంది నృత్యాలు చేస్తూ వస్తుంటారు. స్వామి వారే వీరిలో ఉంటారని నమ్మకం. వారు తొక్కితే పుణ్యం.. దీర్ఘకాలిక రోగాలు... సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
ఇందుకోసం వేకువజామునే నిద్రలేచి తలస్నానం చేసి తడిసిన బట్టల్లోనే ఉపవాసదీక్షలో ఉంటారు. వీరిపై నుంచి భూతప్పలు నడుచుకుంటూ వెళుతారు. వారి పాదస్పర్శ కోసం భక్తులు ఆరాటం చెందుతుంటారు. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతి యేటా సుదూర ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చి భూతప్పల చేత తొక్కించుకుని తిరుగు ప్రయాణమవుతారు. ఇలా తొక్కించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తినా తమ సంప్రదాయం.. ఆచారమని ఇక్కడి భక్తులు అంటున్నారు.