ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర మంత్రిగా అతిపిన్న వయస్కురాలిగా ప్రమాణం చేయడమేకాకుండా, కర్నూలు జిల్లా నుంచి మంత్రి పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. అదేసమయంలో ఆమె ఆదివారమే తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
నిజానికి కర్నూలు జిల్లా నుంచి ఇప్పటివరకు మహిళకు మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుంచి భూమా అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రమాణస్వీకారానికి తరలివచ్చారు. మరోవైపు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సంబరాలు జరుపుకునేందుకు నంద్యాల, ఆళ్లగడ్డలో ఏర్పాట్లు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా నుంచి సుబ్బరత్నమ్మ, భూమా శోభానాగిరెడ్డి, పాటిల్ నీరజారెడ్డి, కోట్ల సుజాతమ్మ, గౌరు చరిత, అఖిలప్రియ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టినా ఏ ఒక్కరు కూడా మంత్రులుగా ప్రమాణం చేయలేదు. ఇప్పుడు తొలిసారిగా అఖిలప్రియకు ఆ అవకాశం దక్కింది. తల్లి శోభానాగిరెడ్డి మరణం తర్వాత 25 ఏళ్లకే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆమె 28 ఏళ్లకే మంత్రి కావడం గమనార్హం. ఏపీ కేబినెట్‌లో ఆమె పిన్నవయస్కురాలు.