బీఎస్-3 సిరీస్ వాహనాల కొనుగోలు స్కామ్‌లో అరెస్టు అయిన అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలకు తేరుకోలేని షాక్ తగిలింది. ఈ కేసులో వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అలాగే, వీరిని విచారించేందుకు పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది.
బీఎస్ 3 వాహనాల కొనుగోలు కోసం నకిలీ ఎన్.ఓ.సీలు సృష్టించడం, సంతకాలు ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అలాగే గతంలో పెండింగులో మరో రెండు కేసుల్లో కూడా వీరిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వీరిని కోర్టులో హాజరుపరచగా, ప్రస్తుతం వీరికి 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.
ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ అనంతపురం కోర్టులో పిటిషన్లను వారిద్దరూ వేర్వేరుగా దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన కోర్టు.. బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. అదేసమయంలో పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. అయితే, న్యాయవాదుల సమక్షంలోనే నిందితులను విచారించాలని కోర్టు ఆదేశాలు జారీచేయడం వారికి కాస్త ఊరటకలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.