బాబును టచ్ చేస్తే తిరుగుబాటు తప్పదు : జేసీ దివాకర్ రెడ్డి

శనివారం, 13 జూన్ 2020 (21:01 IST)
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును టచ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుబాటు తప్పదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలతో పాటు టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, మరో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్‌ల అరెస్టుపై జీసీ దివాకర్ రెడ్డి స్పందించారు. 
 
తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని టచ్ చేస్తే ఏపీలో తిరుగుబాటు ఖాయమన్నారు. అదే జరిగితే ఏపీ ప్రజలు సహించరన్నారు. అలాగే, తన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి అరెస్టులు కక్ష సాధింపు చర్యలేనన్నారు. రాష్ట్రంలో పాలన నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు సాగుతోందన్నారు. తానైతే పార్టీని వీడేది లేదని, ఆ పార్టీలో చేరేది లేదన్నారు. 
 
తాను ఎప్పుడు అరెస్టు అవుతానో తనకు తెలియదని.. అయినా దేనికైనా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి అల్లాపై, శ్రీశైలం మల్లన్నపై నమ్మకం లేదని, తిరుపతి వెంకన్నపై అసలే లేదని, యేసును కూడా నమ్మడని.. అహం ఎక్కువ అన్నారు. దేవుడి కంటే కూడా నరేంద్ర మోడీకి ఎక్కువగా భయపడతాడని ఎద్దేవా చేశారు. 
 
ఏరికోరి తీసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల మాటలే వినడం లేదని, వారి నడుం విరగగొట్టేశారన్నారు. ఏ కాగితంపై సంతకం పెట్టమంటే చీఫ్ సెక్రటరీలు కూడా అక్కడ సంతకాలు పెడుతున్నారన్నారు. రాయలసీమలో ఓ పద్ధతి ఉందని, ప్రత్యర్థుల ఆర్థిక పరిస్థితిని దెబ్బ కొట్టి.. వాళ్లు రోడ్డున పడితే ఈగో చల్లారుతుందని వ్యాఖ్యానించారు. తుగ్లక్ పాలనలో కూడా ఇలాంటి పద్ధతి లేదని, ఈ దేశంలో ఇలాంటి ముఖ్యమంత్రి గతంలోనూ లేడు... రాబోయే రోజుల్లో కూడా రాబోడని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు