2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన - టీడీపీ పొత్తు ఖరారైంది. ఆ తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలు భారతీయ జనతా పార్టీకి చెందిన రాష్ట్ర నేతల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇదే అంశంపై బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశాన్ని అత్యవసరంగా భేటీ అయింది. ఇందులో పవన్ చేస్తున్న ప్రకటనలు గురించి ప్రధానంగా చర్చించారు.
ఈ విషయంలో పార్టీ స్పష్టమైన నిర్ణయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి జాతీయ నేతలతో చర్చిస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చించారు. ఎన్డీఏలోనే ఉన్నట్లు పవన్ చెబుతున్నందున సంయమనం పాటించాలని సీనియర్ నేత ఒకరు పేర్కొన్నారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది.
రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ ఎన్నికల పొత్తులపై పవన్ కల్యాణ్ ప్రకటనలు, ఆయన అభిప్రాయాలను జాతీయ నేతలతో చర్చిస్తామని వెల్లడించారు. త్వరలో జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతల సమక్షంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని తెలిపారు. పంచాయతీల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నట్లు కేంద్ర బృందం పరిశీలనలో తేలిందన్నారు.
నాసిరకం మద్యం వల్ల అనేకమంది అనారోగ్యం బారినపడుతున్నారని తెలిపారు. ఎంపీ రఘరామకృష్ణరాజు మద్యం నమూనాలను ప్రయోగశాలల్లో విశ్లేషణ చేయించిన రిపోర్టులు ఉన్నాయని వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకంతో ఆయుష్మాన్ భారత్‌ను అనుసంధానం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. అందుకు తగ్గట్లు చర్యలు ఉండడం లేదన్న విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు.