మంత్రి జోగి రమేష్ అడ్డా పెడనలో జనసేనాని బహిరంగ సభ.. సర్వత్రా ఉత్కంఠ

బుధవారం, 4 అక్టోబరు 2023 (09:41 IST)
ఏపీ మంత్రి జోగి రమేష్ అడ్డాగా భావిస్తున్న పెడనలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ బుధవారం జరగనుంది. ఈ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పైగా, ఈ సభను జనసేన, టీడీపీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన వారాహి విజయ యాత్రలో భాగంగా, పవన్ కళ్యాణ్ గత మూడురోజులుగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈనెల 1న అవనిగడ్డలో బహిరంగ సభ నిర్వహించారు. రెండు రోజులు మచిలీపట్నంలో సమావేశాలు, జనవాణి నిర్వహించారు. బుధవారం పెడనలో భారీ బహిరంగ సభ తలపెట్టారు. బంటుమిల్లి రోడ్డులో సభ నిమిత్తం ఏర్పాట్లు చేశారు. 
 
అయితే, ఈ సభలో అల్లర్లు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని నిఘా వర్గాల నుంచి పవన్ కల్యాణ్‌కు సమాచారం అందినట్లు తెలిసింది. అమలాపురం తరహాలో సభ జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా పవన్ ఆరోపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాయలసీమ నుంచి వైకాపా నాయకులు... రౌడీలను, అల్లరిమూకలను దించారనీ.. వారు రాళ్లు రువ్వేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జనంలో కలిసిపోయి అల్లర్లకు ప్రణాళిక రచించారనీ.. అలాంటిది జరిగితే సీఎం జగన్, హోంమంత్రి, డీజీపీ, ఎస్పీలు బాధ్యత వహించాల్సి ఉంటందని బహిరంగంగా హెచ్చరించారు. పవన్ ఘాటైన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే... అలాంటిదేమీ లేదని వైకాపా నాయకులు ప్రకటించడం గమనార్హం. 
 
మరోవైపు, పెడన నియోజకవర్గం కీలకంగా మారింది. ఇక్కడ చేనేత వృత్తుల వారు ఎక్కువ. ఆ వర్గంలో జనసేనపై, పవన్‌పై అభిమానం ఎక్కువ. నియోజకవర్గంలో జనసేనకు మంచి పట్టు కూడా వుంది. ప్రస్తుతం ఇక్కడ మంత్రి జోగి రమేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మైలవరం నుంచి ఇక్కడకు వలస వచ్చారు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన అనుచరులతో చంద్రబాబును ప్రశ్నిస్తామని కర్రలతో దండెత్తారు. ఏకంగా చంద్రబాబు ఇంటి మీదకు వెళ్లారు. టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో పలువురు టీడీపీ నేతలు కూడా గాయపడ్డారు. ఆ సమయంలో కర్రలతో దాడి చేసిన జోగి రమేష్ అనుచరులపై కేసులు నమోదు కాలేదు. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కింది. వైకాపాలో దూకుడుగా వ్యవహరిస్తారనే ప్రచారం ఉంది. జి.కొండూరులోనూ టీడీపీ నాయకులు కార్యకర్తలపై ఒకసారి దాడి జరిగింది. నాడు మాజీ మంత్రి దేవినేని ఉమాపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్ చేసిన ప్రకటన ఇపుడు సర్వత్రా ఉత్కంఠను రేపుతుంది. 
 
మరోవైపు, టీడీపీతో జనసేన పొత్తు ప్రకటించిన తర్వాత జనసేనాని తొలిసారిగా కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్టోబరు 1న అవనిగడ్డ సభకు జనసైనికులతోపాటు.. టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సభకు పోలీసులు అడుగడుగునా బారికేడ్లు పెట్టి ఆటంకాలు సృష్టించారు. సభా ప్రాంగణం వద్దకు చేరకుండా అడ్డుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షల పేరుతో ఆటంకపరిచారు. వైకాపా పెద్దల సూచనలతోనే ఇలా జరిగిందని జనసేన నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం పెడనలోనూ ఇదే పంథా కొనసాగుతోంది. పోలీసుల తీరు విమర్శలకు దారి తీస్తోంది.
 
టీడీపీతో పొత్తు ఖరారైన తర్వాత జనసేన తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. వైకాపా శ్రేణుల్లో కొంత నైరాశ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో పోలీసులు పరోక్షంగా, ప్రత్యక్షంగా వైకాపా నాయకులకే సహకరిస్తున్నారనేది బహిరంగ రహస్యమే. వెరసి బుధవారం సభపై రాజకీయంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. పలు నియోజకవర్గాల నుంచి జనసైనికులు భారీగా తరలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. పోలీసులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటారనేది ఆసక్తికరం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు