బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత హిందూ దేవాలయాలపై 150 దాడి సంఘటనలు జరిగాయని, ఒక్కదానిపైనా చర్యలు తీసుకోలేదన్నారు. వినాయక చవితి సామూహికంగా చేసుకోవడం ఆనవాయితీగా వస్తోందని, కేవలం వినాయక చవితి మాత్రమే ఇళ్లల్లో చేసుకోమనడం దారుణమన్నారు.
ఈవిషయం గవర్నర్ దృష్టి కి తీసుకుని వెళ్ళామని, వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరామని బీజేపీ నేతలు వివరించారు. కరోనా నిబంధనలు అనుగుణంగా చవితి వేడుకలు చేయడానికి అవకాశం ఇవ్వమన్నామని, ఎట్టి పరిస్థితుల్లో గణపతి ఉత్సవాలను జరుపుతాం అని కన్నా చెప్పారు. హిందూ సమాజాన్ని తక్కువగా చూడడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.
విహెచ్ పి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పల్నాటి వెంకటస్వామి నాయుడు మాట్లాడుతూ, వినాయక చవితి హిందువులకు ముఖ్యం అని, హిందూ సమాజం పట్ల ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందన్నారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లికి సిగ్గు ఉందా? హిందువుల పట్ల అవమానకరంగా మాట్లాడ్డం ఏంటని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ అంతా గణేష్ ఉత్సవాలు జరుపుతామన్నారు.
గవర్నర్ ని కలిసిన వారిలో బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తో పాటు, సత్య మూర్తి, పాతూరి నాగభూషణం తదితరులు ఉన్నారు.