ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం : చిన్నారికి ప్రాణాంతక ఫంగస్‌

శుక్రవారం, 4 జూన్ 2021 (08:17 IST)
ప్రకాశం జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు దాదాపు 81 బ్లాక్ ఫంగస్ కేసుల నమోదు అయ్యాయి. ఒంగోలు రిమ్స్‌లో 55 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. జిల్లాలో ఇప్పటికే చికిత్స పొందుతూ 13 మంది మృతి చెందగా...11 మందికి రిమ్స్ వైద్యులు ఆపరేషన్లు చేశారు. బ్లాక్ ఫంగస్ నుంచి గురువారం నలుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో మరో ఇద్దరు ఈఎన్టీ స్పెషలిస్టులను బ్లాక్ ఫంగస్ వార్డుకు కేటాయించారు.
 
మరోవైపు, ఏడాదిన్నర చిన్నారికి ప్రాణాంతక బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. ముక్కు, కన్ను, ఊపిరితిత్తుల్లోకి ఇన్ఫెక్షన్‌ చేరి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ దశలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ఆ బాలుడికి ప్రాణాపాయం తప్పించారు. 
 
పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండకు చెందిన 18 నెలల బాలుడు మే 28న బ్లాక్‌ ఫంగ్‌సతో కాకినాడ జీజీహెచ్‌లో చేరాడు. ఈఎన్‌టీ విభాగాధిపతి డాక్టర్‌ కృష్ణకిషోర్‌ చిన్నారి ముక్కు, కన్ను, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌ చేరినట్టు గుర్తించారు. 10 మంది పీడియాట్రిక్‌ వైద్యుల బృందంతో కలిసి ఆ బాలుడికి గురువారం అత్యాధునిక ఫంక్షనల్‌ ఎండోస్కోపిక్‌ సైనస్‌ సర్జరీ (ఎఫ్‌ఈఎ్‌సఎస్‌) నిర్వహించారు. 
 
మూడున్నర గంటలపాటు శ్రమించి బాలుడి ఎడమ పక్క ముక్కు, ఎడమ కన్నులో నుంచి ఊపిరితిత్తుల వరకు వ్యాపించిన ఫంగ్‌సను తొలగించారు. డాక్టర్‌ కృష్ణకిషోర్‌ ఆధ్వర్యంలో బాలుడికి నిర్వహించిన ఆపరేషన్‌ విజయవంతమైందని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రావుల మహాలక్ష్మి తెలిపారు. ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టు వచ్చిన తర్వాత వ్యాధికి గల కారణాలను విశ్లేషిస్తామన్నారు. వైద్య బృందాన్ని అభినందించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు