ఇదే విషయంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెర్ రెడ్డెన్న బృందం స్పందిస్తూ, అజీర్తి.. చాలామంది ఎదుర్కొంటున్న సమస్య. దీనికోసం రకరకాల మందులు వాడుతుంటారు, ప్రయత్నాలు చేస్తుంటారు. ఇకపై వీటి బదులు రెండు మామిడి పండ్లు ఆరగిస్తే అజీర్తి సమస్యకు పరిష్కారం లభిస్తుందని అంటున్నారు.
ఈ అధ్యయన వివరాలను 'అమెరికన్ కెమికల్ సొసైటీ ఫార్మకాలజీ, ట్రాన్స్‌లేషన్' అనే జర్నల్ ప్రచురించింది. హెచ్‌సీయూ ఆచార్యులు రెడ్డెన్న, పరిశోధకులు డాక్టర్ గంగాధర్, కె.సురేష్, కె.అనిల్‌లు.. మాంగిఫెరిన్ రసాయనం అజీర్తిని తగ్గిస్తుందా? పెద్దపేగు, చిన్నపేగులో జీర్ణశక్తి వ్యవస్థను చురుగ్గా పనిచేయిస్తుందా? కేన్సర్ కారక కణాలను నిర్వీర్యం చేస్తుందా? అన్న అంశాలపై ప్రయోగాలు నిర్వహించారు.
ముందు జంతువులకు కృత్రిమ పద్ధతుల్లో అజీర్తి కలిగేలా చేశారు. అనంతరం మాంగిఫెరిన్ మోతాదును పెంచుకుంటూ వెళ్లారు. అది అజీర్తిని తగ్గించడం, జీర్ణశక్తి వ్యవస్థను చురుగ్గా చేయడం, కోలన్ క్యాన్సర్ కణాలను దాదాపుగా నిర్వీర్యం చేయడాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో మాంగిఫెరిన్‌ను వైద్యపరంగా అభివృద్ధి చేసేందుకు, ముందస్తు క్లినికల్ పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు.