దాదాపు నాలుగు పదులకుపైగా అవినీతి కేసుల్లో చిక్కుకుని కాలం వెళ్లదీస్తున్న ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా జగన్మోహన్ రెడ్డికి కేంద్రం పెద్దల చూపిస్తున్న వీర విధేయత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపంగా మారింది. రాష్ట్ర సమస్యలపై కనీసం గట్టిగా అడగలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. దీనికి కారణం అవినీతి కేసుల్లో చిక్కుకుని, బెయిలుపై ఉండటమే. ఫలితంగా కేంద్రం తాజాగా ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయి చూపించారు.
నిజానికి వైకాపా విపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా సహా విభజన హామీల కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిందేనని రంకెలు వేసింది. తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ,25 మంది ఎంపీలన్నీ గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని, విభజన హామీల్నిసాధిస్తామని అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఊరారా తిరుగుతూ పదేపదే చెప్పారు. ప్రజలను నమ్మించారు. కానీ, అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఫ్లేటు ఫిరాయించేశారు. కేంద్రం పెద్దలంటే అంతులేని విధేయత చూపుతూ, కనీసం గట్టిగా అడిగేందుకు కూడా జంకుతూ నాలుగేళ్లు గడిపేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేష్టులుడిగి చూస్తుండటం, కేంద్ర ప్రభుత్వానికి మరింత లోకువగా మారింది. ఈ బడ్జెట్‌లో కూడా పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్‌లకు నిధులు కేటాయింపుపై వైకాపా ఎంపీలు పెదవి విప్పలేని దయనీయ స్ధితిలో ఉన్నారు. నిజానికి విశాఖ రైల్వే జోన్ ఇచ్చామని కేంద్రం చెబుతున్నా.. అడుగు ముందుకు పడటంలేదు. మొత్తంమీద అవినీతి కేసుల్లో చిక్కుకుని ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రజలు ముఖ్యమంత్రిని చేయడంతో దానికి వారు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.