సాధారణంగా సామాన్య భక్తులు ఆన్ లైన్లో టోకెన్లు పొందాలంటే కష్టంతో కూడుకున్న పని. ఇంటర్నెట్ వినియోగం సామాన్య భక్తులకు పెద్దగా తెలియదు. చదుకొన్న వారయితే సులువుగా ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుని టోకెన్లను పొందగలరు. అదే చదువుకోనివారు ఇంటర్నెట్ గురించి తెలియని వారు ఎలా టోకెన్లు బుక్ చేయగలరన్నదే ప్రస్తుతం హిందూ సంఘాలు వేస్తున్న ప్రశ్న.
ఇప్పటి వరకు 2వేల టోకెన్లను కేవలం చిత్తూరుజిల్లా వాసులకే ఇచ్చిన టిటిడి అధికారులు ఇక నుంచి ప్రతిరోజు 8వేల టోకెన్లను ఆన్ లైన్లో ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారట. ఆ టోకెన్లను పొందాలంటే ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవాలంటున్నారు. తిరుమలకు సాధారణంగా తమిళనాడుతో పాటు కర్ణాటక రాష్ట్రాల నుంచే భక్తులు ఎక్కువగా వస్తుంటారు.
చాలామంది మ్రొక్కులు తీర్చుకునేందుకు కాలినడకన వస్తుంటారు. అలాంటి వారిలో చాలామంది నిరక్షరాస్యులు ఉంటారు. అసలు ఇంటర్నెట్లో టిక్కెట్లు పొందడం వారికి ఏమాత్రం తెలియదు. అలాంటి వారికి టిటిడి ఎలాంటి ప్రత్యామ్నాయాన్ని కల్పించడం లేదు. ఈ నిర్ణయాన్ని టిటిడి ఉన్నతాధికారులు వెనక్కి తీసుకుంటారా.. లేకుంటే అలాగే కొనసాగిస్తారా అన్నది చూడాల్సి వుంది.