వైకాపా నేత, తితిదే మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఫేక్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆయనపై తిరుపతి జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తితిదేపై అసత్య ప్రచారం చేసినందుకు ఆయనపై ఈ కేసు నమోదైంది. తిరుపతి, అలిపిరి సమీపంలోని ఓ విగ్రహంపై భూమన అసత్యాలు చెప్పారు.
మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందంటూ, ఇది సనాతన ధర్మానికి విఘాతం కలిగేలా తితిదే అధికారులు నడుచుకుంటున్నారని ఆయన అసత్య ప్రచారం చేశారు. భూమన కరుణాకర్ రెడ్డి తన వ్యాఖ్యలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు.
అంతకుముందు ఆయన అలిపిరిలో శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా వదిలేశారని, మలమూత్రాలు, మద్యం బాటిల్స్ ఆ చుట్టుపక్కల పడి ఉన్నాయంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. విగ్రహం పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని, హైందవ ధర్మం పట్ల తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ తితిదే చైర్మన్, పాలకమండలికి చెందిన సభ్యులంతా తమతమ పదవుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసారు. అలాగే, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హిందూత్వ సంఘాలు, మఠాధిపుతులు మేల్కొవాలని ఆయన కోరారు.