సెంచరీ ప్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సెంచరీ ప్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ సీఎండీ సజ్జన్ భజంకా, ఈడీ కేశవ్ భజంకా, కంపెనీ ప్రతినిధి హిమాంశు షా సీఎంతో చర్చలు జరిపారు.
వైఎస్‌ఆర్ కడప జిల్లా బద్వేలులో సెంచరీ ప్లైబోర్డ్స్ ఇండియా లిమిటెడ్ నూతన ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ప్లైఉడ్, బ్లాక్ బోర్డ్, మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డ్, పార్టికల్ బోర్డ్‌ల తయారీలో భారతదేశంలోనే అత్యంత పెద్ద తయారీ పరిశ్రమగా సెంచరీ ఇండియా ప్రత్యేక గుర్తింపు పొందింది.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, హర్యానా, అసోం, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ఇప్పటికే యూనిట్‌లు ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ఇపుడు బద్వేలులో ప్లాంట్ నిర్మిస్తోంది. దీని వల్ల ఏపీలో రూ. 1,000 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది. 3,000 మందికి ప్రత్యక్షంగా, దాదాపు 6,000 మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఏడాదికి 4,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో మొదటి విడత ప్రారంభించి మూడు దశలు పూర్తయ్యే సరికి 10,00,000 మెట్రిక్ టన్నుల పూర్తి స్ధాయి సామర్ధ్యం నెలకొల్పుతామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
రైతులతో యూకలిప్టస్ తోటల పెంపును ప్రోత్సహించి, కొనుగోళ్ళుపై గిట్టుబాటు ధర కల్పించడం, ఆర్ధికంగా రైతులకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని కంపెనీ ప్రతినిధులు సీఎం కు వివరించారు. కంపెనీ ప్రణాళికలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించి, చర్చించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ ఆర్.కరికాల్ వలవన్ కూడా పాల్గొన్నారు.