ప్రకృతితో ఆడుకున్నారు... బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు...

గురువారం, 25 నవంబరు 2021 (11:04 IST)
భారీ వ‌ర్షాల‌పై ముంద‌స్తుగా స్పందించ‌కుండా ప్రకృతితో ఆడుకున్నార‌ని, ప్ర‌భుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింద‌ని చంద్ర‌బాబు నాయుడు ఆరోపించారు. తిరుపతిలో వ‌ర‌ద న‌ష్టాన్ని ప‌రిశీలించిన ప్ర‌తిప‌క్ష‌నేత నారా చంద్ర‌బాబు నాయుడు అనంత‌రం మీడియా సమావేశంలో మాట్లాడారు. భారీ వర్షాలతో అన్ని రిజర్వాయర్లు నిండిపోయాయ‌ని, భారీ వర్షాలు పడ‌తాయని ముందుగా తెలిసినా ప్రజలతో ఆడుకున్నార‌ని, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.
 
 
గ్రామాలు మునిగిపోతాయని తెలిసినా, అక్క‌డి వారిని సురక్షిత ప్రాంతాలకు ఎందుకు తరలించలేద‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. లక్ష్మీపురం సర్కిల్ లో వరద నీటిలో కొట్టుకుపోయిన సుబ్బారావు డెడ్ బాడీ ఇప్పటి వరకు దొరకలేద‌ని, భర్త నీటిలో కొట్టుకుపోవడంతో భార్య అనారోగ్యానికి గురైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కడప జిల్లాలో ఆరు గ్రామాలు ఇప్పటికీ వర నీటిలోనే ఉన్నాయ‌ని, ఈ ప్ర‌భుత్వం రాయల చెరువు ప్రాంత ప్రజలకు ఎందుకు భరోసా ఇవ్వలేకపోతోంద‌ని ప్ర‌శ్నించారు. 
 
 
ప్రకృతితో ఆడుకున్నారు... నేను తిరుపతిలో పర్యటిస్తున్నానని హడావిడిగా కొన్ని ప్రాంతాల్లో వరద నీటిని శుభ్రం చేశారు. వరద బాధితుల ఆర్తనాదాలు, అసెంబ్లీలో జగన్ కు ఆనందం క‌లిగిస్తోంద‌ని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ మానవ తప్పిదంపై జ్యుడిషనల్ విచారణ జరిపించాల‌ని, తుమ్మలగుంట చెరువు కబ్జాపై విచారణ జరిపించాల‌ని, తప్పిదానికి కారణమైన వారిని శిక్షించాల‌ని ఆయ‌న డిమాండు చేశారు.  తాను వరద బాధితులను చూసి ఆవేదన చెందాన‌ని, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా 40 వేల మందిని ఆదుకున్నామ‌ని, నిరాశ్రయులకు అవసరమైన భోజన సదుపాయాలను కల్పించామ‌ని బాబు చెప్పారు.  
 
 
పునరావాస కేంద్రాల్లో బాధితులను ఆదుకోవడంలో ప్ర‌భుత్వం విఫలమయింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. కపిలతీర్థం నుంచి కొండ పక్కనే కాలువ తీయాల‌ని, కపిలతీర్థం నీరు స్వర్ణముఖి నదిలోకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు