ప్రకృతి తల్లి ఆనందయ్య రూపంలో వచ్చింది : జగ్గూభాయ్ ట్వీట్

మంగళవారం, 25 మే 2021 (18:03 IST)
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనా రోగులకు ఇస్తున్న నాటు మందు ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఈ మందు ఆయుర్వేదం కిందకు వస్తుందా? రాదా? అనే విషయంలో మాత్రం ప్రభుత్వం, వైద్యాధికారులు నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, ఆనందయ్య ఆయుర్వేద మందుకు మాత్రం పెద్ద సంఖ్యలో జనాలు, కరోనా రోగులు మాత్రం బలంగా నమ్ముతున్నారు. తర్వాత ఏం జరిగినా ఫర్వాలేదు... ముందైతే ఆ మందును వేసుకుందామనే యోచనలో ఎందరో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆనందయ్యకు ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు మద్దతుగా నిలిచారు.
 
ఆనందయ్యను చూస్తుంటే తల్లి ప్రకృతి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందనిపిస్తోందని జగపతిబాబు అన్నారు. ఆయన మందుకు అధికారిక అనుమతులు రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఆయన మందు ఈ ప్రపంచాన్ని కాపాడాలని... ఆ విధంగా భగవంతుడు ఆయనను ఆశీర్వదించాలని అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
 
మరోవైపు, కృష్ణపట్నం ఆనందయ్య మందు తయారు చేసే ప్రాంతాన్ని టీడీపీ ప్రతినిధి బృందం మంగళవారం సదర్శించింది. సోమిరెడ్డి, బిదా రవిచంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో నేతలు స్థానికంగా జరుగుతున్న ఔషధ పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఘటన టీడీపీ నేతలను ఆశ్చర్యపరిచింది. 
 
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి విషమ పరిస్థితుల్లో అక్కడికి వచ్చాడు. సోమిరెడ్డి సమక్షంలోనే అతడి కంటిలో ఆనందయ్య కుటుంబ సభ్యులు చుక్కలు వేశారు. 15 నిమిషాల్లో ఆ విద్యార్థి లేచి కూర్చోవడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ విద్యార్థి మాట్లాడుతూ.. తమలాంటి పేదలకు ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా చూడాలని అభ్యర్థించాడు. 
 
ఆ తర్వాత మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా నాయకులు, అధికారులు రాజకీయాలు పక్కన పెట్టి ఆనందయ్య మందు పంపిణీ జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. నివేదికలను సాకుగా చూపి కాలయాపన చేయకుండా ఆనందయ్య ముందు పంపిణీ జరిగేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకోవాలన్నారు. 
 
గతంలో కృష్ణపట్నం పోర్టు వల్ల దేశం మొత్తం కృష్ణపట్నం వైపు చూసిందని, మళ్లీ నేడు ఆనందయ్య మందువల్ల దేశమంతా కృష్ణపట్నం వైపు దృష్టిసారించిందని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద చంద్ర అన్నారు. 

 

Looks like mother nature has come to our rescue. Praying that #Anandayya garu's therapy is authentically approved and will save the world. God bless him pic.twitter.com/fvF1ydYqzS

— Jaggu Bhai (@IamJagguBhai) May 25, 2021

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు