ఉన్మాది పాలనలో గంటకో అత్యాచారం.. పూటకో హత్య : చంద్రబాబు

మంగళవారం, 22 డిశెంబరు 2020 (18:26 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత 20 నెలలుగా ఏపీలో ఉన్మాది పాలన సాగుతోందని మండిపడ్డారు. ఈ ఉన్మాది పాలనలో గంటకో అత్యాచారం.. పూటకో హత్య జరుగుతుందని మండిపడ్డారు. 
 
ఆయన మంగళవారం పార్టీకి చెందిన సీనియర్ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో 175 నియోజకవర్గాల టీడీపీ ఇన్‌ఛార్జ్‌లు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ '20 నెలల ఉన్మాది పాలనలో ప్రజలకు వేధింపులు. వైసీపీ అజెండా అంతా ప్రజల్ని వేధించడమే. దాడులు, దౌర్జన్యాలతో బెంబేలెత్తించారు. ఎంత మందిని ఇబ్బంది పెట్టాలో అంతమందినీ జగన్ ఇబ్బంది పెట్టారు. ప్రశ్నించిన ప్రతిఒక్కరిపై దాడికి తెగబడ్డారు. 
 
ప్రజల్ని దోచుకోవడమే లక్ష్యంగా, ప్రజల్ని మభ్యబెట్టడమే వైసీపీ ధ్యేయం. గంటకో అత్యాచారం, పూటకో హత్యగా నేరగాళ్ల అకృత్యాలు పెచ్చుమీరాయి. అయినా వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించిన పాపాన పోలేదు. వైసీపీ దుర్మార్గాలపై తెలుగుదేశం పార్టీ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. 
 
వైసీపీ బాధిత ప్రజలకు అండగా టీడీపీ ఉంటుంది. వైసీపీ  వైఫల్యాలపై ప్రజలంతా ప్రశ్నించాల్సిన, నిలదీయాల్సిన సమయం వచ్చింది. ప్రతి కార్యకర్త ప్రజా సమస్యలపై గళం విప్పాలి. జగన్ రెడ్డి పాలనపై అన్నివర్గాల ప్రజలు విసుగెత్తిపోయారు' అని చంద్రబాబు పార్టీ నేతలతో అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు