కోడెల మృతిపట్ల చంద్రబాబుకు బాధ లేదు..మంత్రి బొత్సా

గురువారం, 19 సెప్టెంబరు 2019 (18:44 IST)
మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్ మరణంను చంద్రబాబు రాజకీయం చేయడం దురదృష్టకరమని రాష్ట్ర పట్టణాభివృద్దిశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు.

సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోడెల శివప్రసాద్‌ మరణం పట్ల ఎంతో బాధపడ్డామని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయనకు ఏ అవమానం జరిగిందో... ఇంట్లో ఏం ఇబ్బందులు వచ్చాయో.. ఏ కారణం వల్ల చనిపోయారో అని బాధపడ్డామని అన్నారు.

మా వంతు సానుభూతి తెలియచేశామని అన్నారు. అయితే గత మూడు రోజులుగా చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు చేస్తున్న హంగామా చూస్తుంటే బాధగా వుందని అన్నారు. కనీసం కోడెల చనిపోయాడనే బాధ కూడా లేకుండా...కనీస సానుభూతి కూడా లేకుండా.. చంద్రబాబు రాజకీయ కోణంలో.. ఏదో సాధించాలనే తాపత్రేయంతో వున్నట్లు కనిపిస్తున్నారని విమర్శించారు.

చంద్రబాబు ఈ రోజు గవర్నర్‌ ను కలవడానికి వెళ్లారని, గవర్నర్‌ ను కలడాన్ని మేం తప్పు పట్టడం లేదని అన్నారు. కానీ ఇదే చంద్రబాబు గవర్నర్‌ వ్యవస్థ ఒక పనికిమాలిన వ్యవస్థ అని, గవర్నర్‌ ఎవరూ, ఆయన ఒక ఏజెంట్‌ అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకోవాలని అన్నారు.

ఆనాడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ పై హత్యాయత్నం జరిగితే... ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ ఫోన్‌ ద్వారా యోగక్షేమాలు తెలుసుకున్న సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు గుర్తు చేసుకోవాలని అన్నారు. రాజకీయాల్లో వున్న వారు.. నాయకత్వంలో వున్న వారు ఉపయోగించకూడని భాషతో గవర్నర్‌ ను విమర్శించారని అన్నారు.

గవర్నర్‌ వ్యవస్థపై అలాంటి ఉద్దేశాలువున్న చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని నేడు గవర్నర్‌ ను కలిశారని ప్రశ్నించారు. మీకు అధికారం వుంటే ఒకలా.. లేకపోతే మరోలా వ్యవహరించే తీరుకు ఇది నిదర్శనం కాదా అని నిలదీశారు. గతంలో రాష్ట్రంలోకి సిబిఐ రాకూడదంటూ ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు ఇప్పుడు కోడెల మరణంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేయడం విడ్డూరంగా వుందని అన్నారు.

అధికారంకు దూరం కాగానే సిబిఐ కావాలని ఎలా కోరుతున్నారని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని సిబిఐని రమ్మని కోరుతున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఏ ఒక్క వ్యవస్థ అయినా సక్రమంగా పనిచేయలేదని విమర్శించారు. సిఎంగా నిర్వహించిన మొదటి కలెక్టర్ ల సమావేశంలోనే మీ వైఖరి బయటపెట్టుకున్నారని అన్నారు.

మా కార్యకర్తలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారని అన్నారు. ఇప్పుడు మాజీ స్పీకర్‌ కోడెల మృతిని రాజకీయం చేయడానికి వెనుకడటం లేదని అన్నారు. కోడెల మరణంపై ఆ ప్రాంతంలో వినిపిస్తున్న కథనాలు...ఈ మూడు నెలల్లో చంద్రబాబును కోడెల ఎన్నికసార్లు కలిశారు? ఎందుకు కోడెలను కలవలేదని ప్రశ్నించారు.

ఎందుకు కోడెల బిజెపిలో చేరాలని ఆలోచన చేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని బిజెపి నేతలు రఘురాం, రఘునాథరావులు బహిరంగంగా స్పష్టం చేశారని అన్నారు. మా పార్టీ అధ్యక్షుడి దగ్గరకు తీసుకువెళ్లమని కోడెల అడిగినట్లు వారు వెల్లడించారని అన్నారు.

తెలుగుదేశం పార్టలో తనకు గౌరవం లేకుండా చేశారని, పైరవీలకే తప్ప పార్టీ కోసం కష్టపడిన వారికి స్తానం లేదని కోడెల ఆవేదన చెందినట్లు సదరు పార్టీనేతలు వెల్లడించారని గుర్తు చేశారు. మా ఇసుక లారీలను అడ్డుకున్నారని, మా భూములను ఆక్రమించారని, మా నుంచి డబ్బు డిమాండ్ చేశారంటూ కోడెల బాధితులు పోలీసులను ఆశ్రయించారని అన్నారు.

ఈ వ్యవహారంపై పార్టీ పరంగా చంద్రబాబు, ఆయన కుమారుడు ఏనాడు ఖండించలేదు. కోడెలకు అండగా నిలవలేదని అన్నారు. ప్రభుత్వం పెట్టింది కేవలం ఒక్క కేసు మాత్రమేనని అన్నారు. మిగిలిన అన్ని కేసులు ప్రైవేటు వ్యక్తులు చేసిన ఫిర్యాదులపైనే దాఖలయ్యాయని అన్నారు.

కోడెల మీద కేసుల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోందని మీరు నమ్మి, మీ నాయకుల ద్వారా లీకులు ఇప్పించలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన ఆరాచకాలకు సాక్షి మీడియా లేకపోతే నిజాలు బయటకు వచ్చేవా అని ప్రశ్నించారు. మొత్తం మీడియాను మీ గుప్పిట్లో పెట్టుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరాచకాలను బయటపెట్టింది సాక్షిమీడియా అని అన్నారు.

చంద్రబాబుతోపాటు మంత్రులుగా చేసిన వారు తాము చేసిన అవినీతి, అరాచకాలపై ఒకసారి ఆలోచన చేయాలని అన్నారు. గత ఎన్నికల్లో దారుణమైన ఓటమి పాలవ్వడానికి మీ వైఖరే కారణమని అన్నారు. రాష్ట్రంను భ్రష్టు పట్టించడంతో పాటు, అన్ని వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు పోలీస్ వ్యవస్థపై చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా వుందని అన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కోడెలకు అంత్యక్రియలు చేయాలని చూస్తూ.... దానిని కూడా చంద్రబాబు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 
కోడెల మరణం తరువాత ఆయన సెల్‌ఫోన్‌ కనిపించడం లేదని పోలీసులు చెబుతున్నారని అన్నారు. కోడెల మృతిపై విచారణ కోరుతున్న చంద్రబాబు సదరు సెల్‌ ఫోన్ ఎక్కడ వుందని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.

ఈ సెల్‌ ఫోన్‌ ఎవరు దాచారు.. ఎక్కడ వుంది అని ప్రశ్నించారు. కోడెల ఇంటిలో మాయమైన ఈ ఫోన్‌ ను కూడా వైఎస్ఆర్‌ సిపి దాచిపెట్టిందా... ? చంద్రబాబు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సెల్‌ ఫోన్‌ దొరికి దానిలోని డేటా బయటకు రావాలని ఎందుకు చంద్రబాబు కోరడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. 

ముఖ్యమంత్రిగా వుండి కూడా ప్రతిపక్షనేత శ్రీ వైఎస్ జగన్‌ పై కక్షసాధించాలనే గత అయిదేళ్లుగా పనిచేశారని అన్నారు. ఈ నాడు వైఎస్ జగన్‌ సిఎంగా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అభివృద్దిపై సమీక్షలు చేసుకుంటూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్ మాట్లాడటం లేదంటూ చంద్రబాబు విమర్శలు చేయడం విడ్డూరంగా వుందని అన్నారు.

దురదృష్టవశాత్తు గోదావరి పడవ ప్రమాదం జరిగితే అక్కడకు సిఎం వెళ్లారు... అధికారులతో సమీక్షించారు. ఇదీ ముఖ్యమంత్రి చేసే పని. ఆత్మకూరులో రెండు కుటుంబాలు కొట్టుకుంటే... దానిని కూడా చంద్రబాబు రాజకీయ చేయాలని చూశారని అన్నారు. పెయిడ్ ఆర్టీస్ట్ లను తీసుకువచ్చి, క్యాంప్‌ లను ఏర్పాటు చేసి హడావుడి సృష్టించారని విమర్శించారు.

ప్రజలు ఇటువంటివి కోరుకోరని అన్నారు. ప్రజలు తమకు మంచి పాలనను ఇచ్చే ముఖ్యమంత్రిని కోరుకుంటారని అన్నారు. వంద రోజుల్లో సిఎం వైఎస్‌ జగన్‌ ప్రజలకు ఏం చేయాలనే ఆలోచనలతో ముందుకు వెడుతున్నారని, ఇటువంటి ఆలోచనలు సిఎంగా వుండి కూడా చంద్రబాబు ఏనాడు చేయలేదని అన్నారు.

స్పీకర్‌ గా పనిచేసిన వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో ఆయన మరణంపై విచారణ జరగాలని హుందాగా స్టేట్ మెంట్ ఇచ్చి వుంటే చంద్రబాబుకు గౌరవంగా వుండేదని అన్నారు. సమగ్ర దర్యాప్తును కోరితే అందరూ హర్షించేవారు. ఈ పని వైఎస్ఆర్‌ సిపిగా మేం చెప్పాం. కోడెల మరణంపై సమగ్ర దర్యాప్తును కోరాం. కానీ చంద్రబాబు ఏం చెప్పారు.

వత్తిడి వల్ల కోడెల చనిపోయారంటూ ప్రకటించారని అన్నారు. అసలు మూడు నెలల్లో ఎన్నిసార్లు మీరు కోడెలను కలిసారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎందుకు కోడెల బిజెపిలో చేరాని అనుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు