చంద్రబాబు నాయకుడు కాదు. ముఖ్యమంత్రి మాత్రమే. రాజకీయవేత్త మాత్రమే. భారతదేశంలో నిజమైన నాయకులు కనుమరుగైపోయారు అంటూ చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇంకా ఆయన మాట్లాడుతూ... భారతదేశంలో అత్యంత ప్రభావశీలురైన నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి రావాలన్నది నా కోరిక. నేననుకున్న నాయకులు, ఊహించుకున్న నాయకుల్ని తయారు చేయడానికి 25 ఏళ్లు పడుతుంది.
నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాయకుల్ని తయారు చేయడానికి 25 ఏళ్లు పడుతుంది. నా వల్ల ప్రభావితం అయినవారు ఎవరైనా ఉంటే రండి. మీ నుంచి నాయకుల్ని తయారు చేస్తా. నా తుది శ్వాస విడిచేలోపు ప్రతి నియోజకవర్గంలో 100 మంది బలమైన నాయకుల్ని తయారు చేస్తా. అయితే అందుకు మీరు విలువలు పాటించాలి. నిస్వార్ధంగా పని చేయాలి.
మాకు వివక్ష ఉండదు అని చెప్పే నాయకులు కనీసం మాటల్లో కూడా దాన్ని చూపించరు. ఢిల్లీలో నైజీరియా వారిపై దాడి జరిగినప్పుడు ఖండిచాల్సిన బీజేపీ ఎంపి, దక్షిణభారతంలో నల్లగా ఉండే వారితో కలసి ఉండటం లేదా అంటారు. మాజీ క్రికెటర్ సిద్దూ పాకిస్థాన్‌ని మెచ్చుకోవడానికి దక్షిణ భారతాన్ని తగ్గించి మాట్లాడుతారు.
మీరు చెన్నై స్టేడియంలో సిక్స్‌లు కొట్టినప్పుడు చప్పట్లు కొట్టింది పంజాబీలు కాదు. పాకిస్థానీలు కాదు దక్షిణ భారతీయులు. దక్షిణ భారతంలో ఏ రాష్ట్రంలో ఏ భాష మాట్లాడుతారో తెలియదు, దక్షిణాది-ఉత్తరాది భావన ప్రజల్లో పెరిగితే పరిస్థితులు దేశ విభజనకి దారి తీస్తాయి. సమస్య ఉంది. సరిదిద్దుకోండి. దేశాన్ని ప్రేమించే వ్యక్తిగా చెబుతున్నా. వివక్షని వదులుకోండి అని అన్నారు.