కరోనా పరీక్షలు చేయించుకోని వ్యక్తులకు కూడా ఫలితాలా? ఇదో మాయ? చంద్రబాబు
సోమవారం, 6 జులై 2020 (14:29 IST)
కరోనా పరీక్షలు చేయించుకోని వ్యక్తులకు కూడా మొబైల్‌కు ఓ ఎస్ఎంఎస్ రావడం ఏమిటని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఖచ్చితంగా ఇది ఒక మాయ అయినా అయివుండాలి లేదా ఓ స్కామ్ అయినా అయివుండాలి అంటూ ఆరోపణలు గుప్పించారు.
రాష్ట్రంలో పది లక్షల కరోనా టెస్టులు చేశామని వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. మొదటి నుంచి జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూనే ఉందని, కరోనా పరీక్షల గణాంకాల విషయంలో కేంద్రాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
ముఖ్యంగా, 'అనంతపురం నుంచి ఒక వీడియో వచ్చింది. కరోనా పరీక్షల కోసం శాంపిల్ ఇవ్వని వ్యక్తులకు కూడా కరోనా టెస్టుల్లో మీ ఫలితం ఇదీ అంటూ ఫోన్లకు సందేశాలు వస్తున్నట్టు ఆ వీడియోలో చెబుతున్నారు. ఈ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరీ ఇంత నీచానికి దిగజారుతుందన్న విషయం దిగ్భ్రాంతి కలిగించింది.
ఏపీ సర్కారు చెబుతున్న ఒక మిలియన్ కొవిడ్ టెస్టుల గణాంకాలు వట్టి మాయ అయినా అయ్యుండాలి లేకపోతే ఓ కుంభకోణం అయినా అయ్యుండాలి. నేను కేంద్రానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను... వెంటనే ఈ విషయాన్ని పరిశీలించండి. టెస్టులు చేశామంటూ ఫోన్లకు సందేశాలు పంపే ప్రభుత్వ ప్రోద్బలిత రాకెట్ వెనుకున్న మోసపూరిత ఉద్దేశాలను బయటపెట్టండి' అంటూ చంద్రబాబు ట్విట్టరులో విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు చేసిన ఆరోపణలపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తక్షణం స్పందించింది. కరోనా పరీక్ష చేయించుకున్న వ్యక్తి సంబంధిత అధికారులకు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చాడో ఆ ఫోన్ నెంబర్ కే ఫలితాలతో కూడిన ఎస్సెమ్మెస్ వెళుతుందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఒకవేళ కరోనా టెస్టులు చేయించుకున్న వ్యక్తి తప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చినా, లేక మరొకరి నెంబర్ ఇచ్చినా ఆ నెంబరుకే ఎస్సెమ్మెస్ వెళుతుందని వివరించింది. కరోనా టెస్టుల ఫలితాలను సత్వరమే తెలియజేసి ప్రజల్లో భయాందోళనలు తగ్గించడానికి వీలుగా వినూత్నరీతిలో ఈ ఎస్సెమ్మెస్ విధానాన్ని తీసుకువచ్చామని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
అయితే, ఒక మిలియన్ సందేశాల్లో ఏవో కొన్ని సందేశాలను తప్పుబట్టడం, అది కూడా ప్రభుత్వం వైపు నుంచి పొరబాటు లేకపోయినా ప్రభుత్వానికి తప్పులు అంటగట్టడం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ తరుణంలో సరైన పద్ధతి అనిపించుకోదని హితవు పలికింది.
From the beginning, the @ysjagan Govt has cheated people & the Centre reg Covid Testing numbers. This video from Anantapur Dist is proof of that.People who had not even given their samples have received SMSes declaring them to be negative/positive(1/2)#SMSCoronaTestingRacketInAPpic.twitter.com/KBvFTNcDEl
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 6, 2020