తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత చక్కర్లు... బెంబేలెత్తిపోయిన స్థానికులు

గురువారం, 20 ఆగస్టు 2020 (09:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఒకటైన తిరుమల తిరుపతిలో ఈ మధ్యకాలంలో క్రూరమృగాలు జనావాస ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ముఖ్యంగా, కరోనా లాక్డౌన్ కారణంగా తిరుమల ఘాట్ రోడ్లపై ఇవి యధేచ్చగా సంచరిస్తున్నాయి. అయితే, తాజాగా తిరుపతి పట్టణంలోని జూ పార్కు రోడ్డులో ఓ చిరుత పులి చక్కర్లు కొట్టడాన్ని స్థానికులు గుర్తించి హడలిపోయారు. 
 
పక్కనే ఉన్న కొండలపై నుంచి జనావాసంలోకి వచ్చిన ఈ చిరుత.. పలువురు బైకర్లపై దాడికి దిగినట్టు వార్తలు వస్తున్నాయి. ద్విచక్రవాహనాలపై వెళుతున్న వారిని అది చాలా దూరం వెంబడించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ చిరుత దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. 
 
కొద్దిసేపు హంగామా సృష్టించిన తర్వాత ఈ చిరుత పులి కనిపించకుండా పోయింది. దీంతో ఇది తిరిగి అడవుల్లోకి వెళ్లిందా? లేక నగరంలోనే ఎక్కడైనా దాక్కుందా? అన్న విషయం తెలియడం లేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ చిరుతపులి జూ పార్క్ నుంచి తప్పించుకుని వచ్చినది కాదని తెలుస్తోంది. దీన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు