ఇదిలావుంటే, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-సుకుమా జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోల మధ్య చోటు చేసుకున్న భారీ కాల్పుల్లో భారీ సంఖ్యలో జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది పూర్తిగా నిఘా వ్యవస్థ వైఫల్యమనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్ స్పందిస్తూ.. ఈ ఘటనలో నిఘా వ్యవస్థ వైఫల్యం ఏమాత్రం లేదని తెలిపారు.
అలాగే, మావోయిస్టులపై దాడులకు జవాన్లు రచించిన కార్యాచరణలోనూ లోపాలు లేవని చెప్పారు. సమస్యను ముందుగా గుర్తిస్తే జవాన్లు కూంబింగ్‌కు వెళ్లరని తెలిపారు. ఒకవేళ ఆపరేషన్‌లో వైఫల్యం ఉంటే ఎక్కువ మంది నక్సలైట్లు మరణించేవారు కాదని చెప్పారు. సుమారు 25 నుంచి 30 మంది మధ్య మావోయిస్టులు హతమై ఉంటారని కుల్దీప్ సింగ్ తెలిపారు.
కాల్పుల నేపథ్యంలో గాయపడిన, మృతిచెందిన వారిని మావోయిస్టులు మూడు ట్రాక్టర్లలో తరలించినట్లు సమాచారం అందిందని ఆయన చెప్పారు. ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారన్న విషయంపై స్పష్టత రాలేదని తెలిపారు. మావోయిస్టులు జరిపిన ఎదురుకాల్పుల్లో గాయాలపాలైన జవాన్లను ఈ రోజు తాము కలవనున్నట్లు ఆయన చెప్పారు. కాగా, ఈ కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందగా, మరికొందరు జవాన్లకు గాయాలైన విషయం తెలిసిందే.