కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ఈ నెలాఖరు వరకు లాక్డౌన్‌ను అమలు చేయాలని కేద్రం నిర్ణయించింది. అయితే, రవాణా సౌకర్యాల అంశంపై ఆయా రాష్ట్రాలు మాత్రమే తుది నిర్ణయం తీసుకునే వెసులుబాటును కల్పించాయి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులను నడిపేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నతాధికారులతో కరోనాపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెడ్ జోన్లు మినహా, మిగిలిన జోన్లలో ఆర్టీసీ బస్సులని సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం.
మరోవైపు, రవాణా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, రాష్ట్రంలో బస్సులు తిప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు సీఎం నుంచి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు. కండక్టర్లు లేకుండానే బస్సులు నడిపే ప్రతిపాదన సీఎం పరిశీలనలో ఉందని, దానికి ఆమోదం వస్తే ప్రయోగాత్మకంగా కొన్ని సర్వీసులు నడిపి, క్రమంగా రాష్ట్రమంతటా అమలు చేస్తామని చెప్పారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ చార్జీలు పెంచబోమని, నష్టమైనా భరిస్తామన్నారు. సీఎం నుంచి స్పష్టత వస్తే 24 గంటల్లో ఆర్టీసీ సేవలు ప్రారంభమవుతాయని మంత్రి పేర్ని నాని వివరించారు. విజయవాడలోని ఆర్టీసీ పరిపాలన భవనంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.