శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబరు 11, 12వ తేదీల్లో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ శ్రీ హరినారాయణ్‌తో కలిసి టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ముఖ్యమంత్రివర్యులు అక్టోబరు 11వ తేదీన మధ్యాహ్నం తిరుపతికి చేరుకుని తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిలో శ్రీ వేంకటేశ్వర పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుపత్రిని ప్రారంభిస్తారని, ఆ తరువాత వరుసగా అలిపిరి కాలినడక మార్గం పైకప్పు, అలిపిరి పాదాల మండపం వద్దగల గోమందిరం ప్రారంభోత్సవాలు చేస్తారని వెల్లడించారు.
అక్కడినుండి తిరుమలకు చేరుకుని సాయంత్రం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. అక్టోబరు 12న ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారని, ఆ తరువాత ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను, నూతన బూందీ పోటును ప్రారంభిస్తారని వివరించారు.
తిరుపతిలో ముఖ్యమంత్రి పాల్గొనే ప్రారంభోత్సవాల ప్రదేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని టిటిడి భద్రతా విభాగం అధికారులను ఆదేశించారు. అలిపిరి పాదాల మండపం, గోమందిరం వద్ద అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, జెఈవో శ్రీమతి సదా భార్గవి, బర్డ్ ఆసుపత్రిలో జెఈవో శ్రీ వీరబ్రహ్మయ్య ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. ఆ తరువాత ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలకు సంబంధించి తయారుచేసిన వీడియో క్లిప్‌లను ఈవో పరిశీలించి పలు మార్పులు చేశారు.
అనంతరం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాలను శుక్రవారం ఈవో తనిఖీ చేశారు. శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, మాడ వీధులు, గొల్లమండపం, బూందీ పోటు తదితర ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా జరిగేలా అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.