కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం రాజ్యసభ సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు సీఎం రమేష్ ఈ నెల 20వ తేదీ నుంచి ఆమరణ దీక్ష చేయాలని సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో రమేష్ గత కొన్ని రోజులుగా ఈ విషయమై చర్చించారు. ఆఖరికి నిరాహార దీక్ష చేసేందుకు కడప జిల్లా పరిషత్ ఆవరణలో వేదికను సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనల మేర ఫీజు చెల్లిస్తున్నారు.
ఎక్కడా సామాన్యులకు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా ఉండేదుంకు జిల్లా పరిషత్ ఆవరణను ఆమరణ దీక్షా శిబిరానికి ఎంచుకున్నట్లు సమాచారం. కాగా తొలిరోజు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులతో సహా వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, హాజరయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ దీక్షకు అన్ని విధాల సహకరించాలని అధికారులకు, పార్టీ నాయకులకు పార్టీ అధిష్టానం ఆదేశించినట్టు సమాచారం.