ప్రతి పాఠశాలను ఇంగ్లీష్ మీడియం స్కూల్‌గా మార్చుతాం : సీఎం జగన్

గురువారం, 5 సెప్టెంబరు 2019 (17:59 IST)
రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌‌లో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు కన్నబాబు, కొడాలి నాని, పేర్ని నాని, ఎంపి సురేష్, ఎమ్మెల్యేలు కె.పార్థసారధి, మల్లాది విష్ణు, దూలం నాగేశ్వరరావు, కె.రక్షణనిధి, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రసంగిస్తూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దశ, దిశ మార్చేందుకు ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టిందని అన్నారు. ప్రభుత్వం చేసే ఈ నిర్ణయాలను విజయవంతం చేసే బాధ్యత ఉపాధ్యాయులపైనే వుందని గుర్తు చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
 
'గురువులందరికీ వందనాలు.. ఇక్కడ వున్న మాస్టర్లకు అభినందనలు... నాకు చదువు చెప్పిన ప్రతి గురువు పాదాలకు వందనాలు చెబుతూ... ఇక్కడ నాలుగు మాటలు చెబుతున్నాను. ఈ రోజు గురు పూజోత్సవం. మన తెలుగు వారు, మహానుభావుడు, డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని దేశమంతటా టీచర్స్‌ డేగా జరుపుకుంటోంది. 
 
అధ్యాపకులుగా జీవితాన్ని ప్రారంభించి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌‌గా పనిచేసి, భారత రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారి జీవితం తరతరాలకు స్ఫూర్తి నిచ్చే ఒక గొప్ప పాఠం. తన జీవితాన్ని మార్చిన ఏ గురువును... ఏ పిల్లవాడు ఎంత ఎదిగినా కూడా మర్చిపోలేడు. దీనికి ఒక నిదర్శనం కూడా చెప్పాలంటే... సాక్షాత్తు దివంగత నేత, మన ప్రియతమ నాయకుడు రాజశేఖరెడ్డి జీవితమే అని చెప్పవచ్చు. తనకు పాఠాలు చెప్పిన బిసి కులానికి చెందిన ఒక అధ్యాపకుడు వెంకటప్పయ్య పేరుతో పులివెందులలో ఆ దివంగత నేత ఒక స్కూల్‌‌ను స్థాపించారు.
 
వైఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఆ స్కూల్‌‌ను ఇవ్వాల్టికీ నడుపుతూ వుందంటే... ఏ రకంగా గురువు తన విద్యార్థి గుండెల మీద ఒక ముద్ర వేయగలుగుతాడు అనేదానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టే గురువు చేసే పని బహుశా ఎవరూ చేయలేరేమో.. అందుకే అంటారు... గురు:బ్రహ్మ... గురు: విష్ణు.. గురు:దేవో మహాశ్వరహ:' అని, 'ఇక్కడ రెండు అంశాలపై మనమంతా ఆలోచన చేయాలి. ఒకటి... మనం ఇవ్వాళ ఆంధ్రరాష్ట్రంలో చదువుల పరంగా ఏ స్థాయిలో వున్నామో ఆలోచన చేయమని కోరుతున్నాను. 2011 జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో నిరక్ష్యరాస్యత 33 శాతం. అదే జాతీయ సగటు 27 శాతం మాత్రమే. అంటే జాతీయ సగటు కన్న మనరాష్ట్రంలో నిరక్ష్యరాస్యత రేటు ఎక్కువగా వుందంటే దాని అర్థం ఏమిటీ అనేది ఒక్కసారి ఆలోచించాలి. 
 
ఈ రాష్ట్రంలో చదువుకోవాలనే ఆరాటం.... చదివించాలనే తపన అందరికీ వుంది. తపన వున్నా చదివించలేని పరిస్థితులు ఏ విధంగా వున్నాయో అనేదానికి ఇది ఒక నిదర్శనం. 33 శాతం వున్న నిరక్ష్యరాస్యతను జాతీయ సగటును దాటి ఇప్పుడు వున్న పరిస్థితిని పూర్తిగా దాటిపోయి... అయిదేళ్లలో సున్నాశాతంకు తీసుకురావాలనేదే నా తాపత్రయం... తపన'. 'ఇదే ఒకసారి గమనిస్తే... 18-23 సంవత్సరాలలోపు.. అంటే ఇంటర్మీడియేట్‌ పూర్తి చేసుకుని కాలేజీలో చదవే వయస్సులో వున్న వారు ఎంతమంది కాలేజీ బాట పడుతున్నారు అని గమనిస్తే... బ్రిక్స్‌ దేశాలతో మనం ఎప్పుడూ కంపేర్‌ చేసుకుంటూ వుంటాం. 
 
ఈ దేశాలతో పోల్చుకుంటూ వుంటే... 18-23 మద్య వయస్సులో వున్న పిల్లలు ఎంతమంది కాలేజీలో చేరుతున్నారని గమనిస్తే రష్యాలో 81 శాతం, చైనాలో 48 శాతం, బ్రెజిల్‌లో 50 శాతం, మనదేశంకు వచ్చేసరికి కేవలం 26 శాతం. అంటే 74 శాతం మంది పిల్లలు ఇంటర్మీడియేట్‌ దాటి కాలేజీ చదువే పరిస్థితి మన దేశంలోనూ, రాష్ట్రంలోనూ లేదు. ఈ పరిస్థితిని మార్చాలి. బ్రిక్స్‌ దేశాలతో పోటీ పడాలి. రాష్యాలో 81 శాతం వుంటే.. దానికన్నా మనరాష్ట్రంలోనూ ఎక్కువ వుండాలనే తాపత్రయంతో పూర్తి ఫీజురీయంబర్స్‌మెంట్‌ పథకానికి శ్రీకారం చుడుతూ అడుగులు ముందుకు వేస్తున్నాం'. 
 
'అమ్మ ఒడి పథకం అయితేనేమీ... పూర్తి ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పథకం అయితేనేమీ... చదువుకుంటున్న పిల్లలకు బోర్డింగ్‌ అండ్‌ లాడ్జింగ్‌ కోసం... కాలేజీలో చదువుకుంటున్న పిల్లలకు సంవత్సరానికి 20 వేల రూపాయలు ఖచ్చితంగా ఇచ్చే కార్యక్రమాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. నిరక్ష్యరాస్యత శాతాన్ని పూర్తిగా మార్చివేసే దిశగా అడుగులు వేస్తున్నాం. ఒకసారి గమనించినట్లయితే ఈరోజు మన పిల్లలు, మన స్కూళ్ల పరిస్థితి ఏమిటీ అని చూస్తే... నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో.. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు.. చాలా స్కూళ్లు దయనీయంగా కనిపించాయి. చాలామంది పిల్లలు, ఉపాధ్యాయులు నా వద్దకు వచ్చారు. వారి సమస్యలను చెప్పారు. 
 
కేవలం ప్రతిపక్ష నాయకుడి వద్దకు వచ్చి వారి గోడు చెప్పుకున్నారనే పేరుతో కొందరు ఉపాధ్యాయులను ఆనాటి ప్రభుత్వం ఏకంగా సస్పెండ్‌ కూడా చేసింది. కానీ వాస్తవం ఏమిటీ అని ఆ ప్రభుత్వం ఆలోచన చేయలేదు. ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేస్తుంటే... ఎందుకు పిల్లలు, టీచర్లు ఆయన వద్దకు వచ్చారు... స్కూళ్ల పరిస్థితి ఏమిటీ అని అప్పట్లోని ప్రభుత్వం ఆలోచించలేదు. ఆనాడు స్కూళ్ల పరిస్థితిని గమనిస్తే ఆశ్చర్యకరమైన పరిస్థితి కనిపించాయి. స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి ఎనిమిది నెలలకు పైగా బకాయిలు... సరుకులుకొనే పరిస్థితి లేదు... ఆయాలకు ముష్టి వేసినట్లు ఇచ్చే గౌరవ వేతనం వెయ్యి రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఎనిమిది నెలలు బిల్లులు పెండింగ్‌‌లో పెడితే.. వారు సరుకులు ఎలా తీసుకురాగలరు... పిల్లలకు తిండి ఎలా పెట్టగలరు...ఆ పిల్లలు ఆ తిండిని ఏం తినగలరు.. పిల్లలు చదువుల బాటకు ఎలా వస్తారనే కనీస ఆలోచన కూడా లేకుండా మానవత్వం లేని పరిపాలన సాగించారు.
 
స్కూళ్లలో పరిస్థితి చూస్తే అధ్వన్నంగా వున్నాయి. బాత్రూంలలో నీళ్లు వుండవు. స్కూళ్లలో జూన్‌ మొదటి వారంలోనే పుస్తకాలు పిల్లలకు అందుబాటులోకి రావాల్సి వుండగా... అక్టోబర్, నవంబర్‌ నెలలు వచ్చినా... పుస్తకాలు పిల్లలకు పంపిణీ చేయలేదు. టీచర్ల పరిస్థితి అంతే.. తక్కువగా వున్నారని తెలిసినా... కొత్త నియామకాలు చేయలేదు. ఇక యూనిఫారంల పరిస్థితి కూడా అంతే... ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వలేని దుస్థితి. ఒక ప్రభుత్వమే దగ్గర వుండి ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేయాలని చూస్తే... ఏ రకంగా స్కూళ్లు తయారవుతాయనే దానికి నిదర్శనాన్ని నా పాదయాత్రలో గమనించాను.
 
ఇవ్వన్నీ చూసిన తర్వాతనే అధికారంలోకి వచ్చిన తరువాత వంద రోజుల్లోపే విప్లవాత్మక మార్పులు చేస్తూ అడుగులు ముందుకు వేశాం. స్కూళ్ల దశ, దిశ మార్చేట్టుగా ప్రతి స్కూల్‌ కు ఫోటో తీస్తున్నాం. మూడు సంవత్సరాల్లో ప్రతి స్కూల్‌ పరిస్థితిని మారుస్తూ... నాడు... నేడు అని తెలిసేట్లుగా ఫోటోలను ప్రదర్శించేలా మార్పు తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తి చేశాను. ఇక్కడ వున్న అధికారులు, మంత్రులు, నేను కూడా మార్పు కోసం కట్టుబడి వున్నాం. ప్రతి స్కూల్‌ లోనూ మార్పు తీసుకువస్తాం. తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తాం. ప్రతి స్కూల్‌ ను ఇంగ్లీష్‌ మీడియంగా మార్చాలని ఆరాటపడుతున్నాం. పిల్లలకు మంచి చదువులు రావాలి, స్కూళ్లలో మౌలిక సదుపాయాలు బాగుండాలి.
 
మన పిల్లలు ఏమాత్రం మొహమాటం లేకుండా, చిరునవ్వులతో ప్రభుత్వ బడులకు పంపాలని ఆరాటంతో అందరం వున్నాం. కానీ ఇవ్వన్నీ చేసేటప్పుడు ఒక ముఖ్యమైన అంశం వుంది. ఇవ్వన్నీ విజయవంతం కావాలి అంటే ఆ బృహత్కర బాధ్యత ఉపాధ్యాయుల భుజస్కందాలపై వుంది. ఈ విషయాన్ని నేను, మా మంత్రులు, అధికారులు మరిచిపోరు. ఈ బాధ్యత మీపైనే వుంది. ప్రతి ఒక్కరూ మీ వైపే చూస్తున్నారు. ఈ వ్యవస్థలో ఏ మార్పులు రావాలన్నా.. అది మొట్టమొదట అడుగులు పడేది మీ రు చూపించే బాట నుంచే మొదలవుతాయి. ఈ విషయాలన్ని చెబుతూ... మీ బాధ్యతలన్ని మరోసారి మీ అందరికీ గుర్తు చేస్తూన్నా.. మీ బాధ్యతల్లో మీరు గొప్పగా ఫర్‌ఫాం చేస్తారని ఆశిస్తూ...ఈ టీచర్స డే రోజున మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు చెబుతున్నాను.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు