కరోనా మృతుని అంత్యక్రియల్లో పాల్గొన్న కలెక్టర్.. ఎందుకో తెలుసా?
సోమవారం, 3 ఆగస్టు 2020 (09:09 IST)
ఆయనో ఐఏఎస్ అధికారి. ఆ అంటే చాలు ఎస్ అనే మందీమార్బలం ఎప్పుడూ వెన్నంటి వుంటారు. అలాంటిది ఆయనే స్వయంగా ఓ కరోనా బాధితుడి అంత్యక్రియలకు స్వయంగా హాజరయ్యారు. ఆయనే గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్.
కరోనా రోగుల మృతుల అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రజలు వెనుకాడుతుండడంతో.. అపోహలను తొలగించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయనే స్వయంగా పూనుకున్నారు. గుంటూరులోని బొంగరాలబీడు స్మశాన వాటికలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. "కరోనా వైరస్ తో చనిపొయిన వ్యక్తుల మృతదేహాల అంత్యక్రియలపై ప్రజల్లో ఉన్న భయాందోళనలు, అపోహలు పోవాలి..
దీనికోసమే జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమంను చేపట్టింది. కరోనా వైరస్ వలన చనిపోయిన వ్యక్తి మృతదేహాం నుంచి వైరస్ వ్యాప్తి చెందదు అని ప్రచారం నిర్వహించటంతో పాటు ప్రజలకు పూర్తిగా అవగాహన కలిగేలా సాక్షాత్తు నేనే పాల్గొన్నాను.
కోవిడ్–19తో చనిపోయిన వ్యక్తి మృతదేహంలో 6 నుంచి 7 గంటల తరువాత కరోనా వైరస్ ఉండదు. సాధారణంగా చనిపోయిన వ్యక్తి శరీరంలో 24 గంటలు తర్వాత ఎటువంటి వైరస్‌లు ఉండవు.
కోవిడ్ –19 నిబంధనల ప్రకారం కరోనా వైరస్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహంను సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పూర్తిగా రుద్ది, బ్యాగ్‌లలో ప్యాక్ చేసి మృతదేహాలను అందిస్తారు.
పీపీఈ కిట్లు ధరించి మృతదేహంను పట్టుకొని అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. పాజిటివ్ వ్యక్తి మృతదేహంను సమీపం నుంచి చూసిన, మాస్క్ ధరించి బౌతికదూరం పాటిస్తూ అంత్యక్రియల్లో, పాల్గొన్నా కరోనా వైరస్ సోకదు.
ప్రజల్లో ఉన్న అపోహాలు భయందోళనలు వలన కరోనా వైరస్ సోకి చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించటం కోసం కొన్ని సంధర్భాల్లో కుటుంభసభ్యులే ముందుకు రావటం లేదు.
అదే విధంగా పాజిటివ్ వ్యక్తుల అంత్యక్రియలను తమ స్మశానావాటికల్లో చేయవద్దని కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అడ్డుకుంటున్నారు.
చనిపోయిన వ్యక్తుల మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించకపోవటం మానవత్వానికే మచ్చగా నిలుస్తుంది.
ధైర్యంగా కుటుంబసభ్యులు కరోనా వైరస్‌తో చనిపోయిన వ్యక్తుల మృతదేహాలను తీసుకువెళ్ళి కోవిడ్–19 నిబంధనల ప్రకారం స్వస్థలాల్లో గౌరవంగా అంతిమ సంస్కారం నిర్వహించుకోవాలి.
మానవతా దృక్పధంతో ఆలోచించి ముఖ్యంగా గ్రామాల్లోని ప్రజలు కోవిడ్– 19తో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు గౌరవ ప్రదంగా జరిగేలా జిల్లా యంత్రాంగంకు సహకరించాలి.
వైరస్‌తో చనిపోయిన వ్యక్తి కుటుంబసభ్యులు క్వారంటైన్‌లోను, కోవిడ్ –19 ఆసుపత్రులలో ఉంటే అటువంటి మృతదేహాలను స్వచ్ఛంద సేవా సంస్ధల సహకారంతో 48 గంటల్లోనే వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా గౌరవంగా అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
గుర్తుతెలియని వ్యక్తుల మృతదేహాలను సైతం నిబంధనల ప్రకారం పోలీస్, రెవెన్యూ యంత్రాంగంతో 48 గంటల్లోపే విచారణ పూర్తి చేసి అంత్యక్రియలు నిర్వహించే ఏర్పాట్లు ఉన్నాయి" అని వివరించారు.
జేసీ వెంట కరోనా రోగి అంత్యక్రియల్లో గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి భాస్కరరెడ్డి, జిల్లా కోవిడ్ –19 మృతదేహాల మేనేజ్‌మెంట్ నోడల్ అధికారి రమేష్ నాయుడు , అమ్మ చారిటబుల్ ట్రస్ట్ , మహాప్రస్థానం సేవాసమితి ప్రతినిధులు పాల్గొన్నారు.