అవినీతి కేసుల్లో చిక్కుకుని అన్న జైలుపాలైనపుడు అన్నీ తానై వైకాపాను నడిపించిన వైఎస్ తనయ షర్మిళ.. ఇపుడు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అస్సలు తన అన్న ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్‌తో కూడా అంటీఅంటన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం వారిద్దరి మధ్య వైరం ఏర్పడటంతో దూరం పెరిగిందనే ప్రచారం సాగుతోంది.
ముఖ్యంగా, ఇపుడు వైఎస్. షర్మిళ వ్యవహారం కడప జిల్లాలో హాట్ టాఫిక్‌గా మారింది. ఈసారి ఇడుపులపాయలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు షర్మిళ దూరంగా ఉండటంతో రాజకీయంగా ఇది మరింత చర్చనీయాంశమైంది. ప్రతిసారి క్రిస్మస్ వేడుకలకు ఖచ్చితంగా హాజరయ్యే ఆమె.. ఈ ఏడాది రాకపోవడంతో పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపైనే కడప జిల్లా వాసులు తలోరకంగా మాట్లాడుకుంటున్నారు.
నిజానికి గత కొన్ని రోజులుగా షర్మిల గురిచి ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈమెకు తెలంగాణ వైకాపా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో క్రిస్మస్ వేడుకలకు హాజరుకాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు వచ్చాయన్న చర్చ జరుగుతోంది.
ఈ ఇద్దరి మధ్యా విభేదాలు ఉన్నాయని గతంలో కూడా వార్తలు వచ్చాయి. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీ బలోపేతం కోసం షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టి.. పార్టీ ఉనికిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే జగన్ బయటకు వచ్చాక పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు.
అలాగే, జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాక కూడా ఆమె స్థానం నామమాత్రమే అయ్యింది. పార్టీలో నెంబర్ టు అనుకుంటే.. చివరికి ఏ హోదా లేకుండా.. కేవలం జగన్ అన్న చెల్లిగా, ఆయన వదిలిన బాణంగా ఉండిపోయారు. చివరకు వైఎస్ పుత్రికగానే ఇపుడు ఉండిపోయారు.
అయితే.. అన్నాచెల్లి మధ్య ఎంతవైరం ఉన్నప్పటికీ క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నది మాత్రం లేదు. ప్రతియేటా క్రిస్మస్ వేడుకల్లో కుటుంబంతో కలిసి పాల్గొనేవారు. ఈసారి ఆమె రాకపోవడానికి కారణం ఆమె తనయుడేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
అమెరికాలోని తన కుమారుడి దగ్గరకు వెళ్లడంతోనే ఆమె క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారని ఓ వర్గం నేతలు చెబుతున్నారు. ఏదిఏమైనా.. షర్మిల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. మరి మున్ముందు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో వేచిచూడాల్సిందే.